Afro Asia Cup: ఒకే టీమ్‌లో రోహిత్, కోహ్లీ, బాబర్, రిజ్వాన్‌.. త్వ‌ర‌లోనే ఫ్యాన్స్‌ కల నిజమయ్యే అవ‌కాశం!

Virat Kohli to team up with Babar Azam Afro Asia Cup could be revived in 2025 says Reports
  • ఆఫ్రో-ఆసియా కప్‌ను పున‌రుద్ధ‌రించే అవ‌కాశం ఉంద‌న్న ఏసీఏ చీఫ్ సమోద్ దామోదర్
  • ఈ టోర్నీలో ఆసియా దేశాల క్రికెటర్లు ఒక జట్టుగా, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా పోటీ
  • త‌ద్వారా మ‌ళ్లీ ఒకే జ‌ట్టులో భార‌త స్టార్లు, పాక్ స్టార్ల‌ను చూసే అవ‌కాశం
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. దాయాదుల పోరు అంటే ఆట‌గాళ్లే కాదు, అభిమానులు కూడా బాగా ఎమోషనల్ అవుతుంటారు. అలాంటిది ఇరు జట్ల స్టార్ ప్లేయర్లు కలిసి ఒకే జ‌ట్టుకు ఆడితే ఎలా ఉంటుంది? 

భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, పాక్ సార‌థి బాబ‌ర్ ఆజామ్ క‌లిసి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును ఓడించేందుకు వ్యూహాలు ర‌చిస్తే? స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌, షహీన్ అఫ్రిది తదితర ఆటగాళ్లు ఒకే టీమ్‌లో క‌నిపిస్తే ఆ కిక్కే వేరు. 

అయితే, త్వ‌ర‌లోనే ఉపఖండంలోని చాలా మంది అభిమానుల కల నిజమయ్యే అవ‌కాశం ఉంది. ఒకే జట్టు తరఫున భార‌త్‌, పాకిస్థాన్ స్టార్ ప్లేయ‌ర్లు ఆడే ఛాన్స్ ఉంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఆఫ్రో-ఆసియా కప్ ఇలా ఇరు దేశాల‌ ఆటగాళ్లు ఒకే జట్టులో కలిసి ఆడేందుకు వీలు కల్పిస్తుంది.

ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ సమోద్ దామోదర్, తదుపరి ఐసీసీ బాస్ జైషా అధ్యక్షతన 2025లో ఆఫ్రో-ఆసియన్ క‌ప్‌ను పునరుద్ధరించవచ్చని వెల్లడించారు. 35 ఏళ్ల జై షా ఇటీవ‌ల ఐసీసీ ఛైర్మ‌న్‌గా ఎన్నికైన విష‌యం తెలిసిందే. 

ఈ ఏడాది డిసెంబర్ 01 నుంచి ఆయ‌న బాధ్య‌త‌లు చేపట్టబోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌ళ్లీ ఈ టోర్నీని నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని దామోద‌ర్ పేర్కొన్నారు. ఈ విష‌య‌మై ఇంత‌కుముందు వారి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. 

ఆఫ్రో-ఆసియా కప్ అంటే ఏమిటి?
2005, 2007లో ఆఫ్రో- ఆసియా కప్‌ పేరిట ఓ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేవారు. ఈ టోర్నీలో ఆసియా దేశాల క్రికెటర్లు ఒక జట్టుగా, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి తలపడేవారు. ఆసియా జ‌ట్టులో భారత్‌, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన ఆటగాళ్లు ఉంటారు. అలాగే ఆఫ్రికన్ జ‌ట్టు త‌ర‌ఫున దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యాల దేశాల‌ క్రికెటర్లు పాల్గొంటారు.  

అప్పట్లో ఆసియా జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఇంజమామ్‌ ఉల్ హక్‌, జహీర్ ఖాన్‌, షోయబ్ అక్తర్‌, షాహిద్‌ అఫ్రిదీ ఆడారు. అటు షాన్ పొలాక్, జాక్వెస్ కలిస్, టాటెండా తైబు వంటి ఆటగాళ్లు ఆఫ్రికా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఒకవేళ ఈ టోర్నీ మళ్లీ జరిగితే భారత్, పాకిస్థాన్‌ ఆటగాళ్ల‌ను ఒకే జట్టులో చూడవచ్చు.
Afro Asia Cup
Virat Kohli
Babar Azam
Rohit Sharma
Cricket
Sports News

More Telugu News