Vinesh Phogat: వినేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై మహావీర్ ఫోగాట్, బబిత విమర్శలు

vinesh phogat politics entry babita targeted bhupinder hooda said he succeeded
  • జులానా నియోజకవర్గం నుండి బరిలో దిగుతున్న వినేశ్ ఫోగాట్
  • కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరికను తప్పుబడుతున్న బంధువులు
  • ఆమె రాజకీయాల్లోకి రావడం పెద్ద తప్పన్న పెదనాన్న 
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఆమెను పార్టీ అధిష్ఠానం జులానా నియోజకవర్గం అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం కుటుంబ సభ్యుల నుండే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె పెదనాన్న మహావీర్ ఫోగాట్ మాట్లాడుతూ, వినేశ్ ఫోగాట్ తదుపరి ఒలింపిక్స్ పై దృష్టి పెట్టకుండా రాజకీయాల్లోకి రావడం చాలా పెద్ద తప్పు అన్నారు.  

తాజాగా ఆమె బంధువు, బీజేపీ నేత బబిత ఫోగాట్ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత భూపీందర్ హుడా పన్నిన పన్నాగం కారణంగా వినేశ్ కుటుంబంలో చీలిక వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ విధానమే విభజన విధానమని దుయ్యబట్టారు. రాజకీయ లబ్దికోసమే వినేశ్ కుటుంబంలో కాంగ్రెస్ చీలిక తెచ్చిందని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. విభజించి పాలించడమే కాంగ్రెస్ అజెండా అని విమర్శించారు. 

తమ పెదనాన్న మహావీర్ ఫోగాట్ సలహాలను వినేశ్ పాటించాలని కోరారు. వినేశ్ గురువు మహావీర్ అని, ఆయనే సరైన మార్గనిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. కాగా హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడి కానున్నాయి.
Vinesh Phogat
Haryana Elections
Congress

More Telugu News