Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఏడుగురి మృతి

Seven Killed in Road Accident at Devarapalli Andhra Pradesh
  • తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో బోల్తాప‌డ్డ జీడిపిక్కల మినీ లారీ 
  • ఈ ప్రమాదంలో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం నుంచి జీడిపిక్కల లోడుతో బయలుదేరిన లారీ
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత‌ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో బయలుదేరిన మినీ లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

టి. నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో మినీ లారీ బయలుదేరింది. ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకెళ్లి తిరగబడింది. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు చనిపోయారు. 

ప్ర‌మాద స‌మ‌యంలో వాహ‌నంలో 9 మంది ఉన్నారు. గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒక‌రు ఘంటా మ‌ధు (తాడిమ‌ళ్ల‌) కాగా, మరొకరి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం తర్వాత డ్రైవర్‌ పరారయ్యాడు. ఈ ప్ర‌మాదం గురించి స‌మాచారం అందుకున్న డీఎస్‌పీ దేవ‌కుమార్‌, ఎస్సైలు సుబ్ర‌హ్మ‌ణ్యం, శ్రీహ‌రిరావు వెంట‌నే ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.   

మృతుల వివ‌రాలు..
ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన‌ వారి వివరాలను పోలీసులు వెల్లడించారు. సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి. చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌ ఈ ప్రమాదంలో మృతి చెందారని పోలీసులు తెలిపారు.
Andhra Pradesh
Road Accident
Devarapalli
East Godavari District

More Telugu News