Kondareddypalli: మోడల్ విలేజ్... పూర్తిస్థాయి సోలార్ గ్రామంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Kondareddypalli to become fully solar powered village
  • 100 శాతం సౌరశక్తి గ్రామంగా కొండారెడ్డిపల్లిని ప్రోత్సహించాలని నిర్ణయం
  • ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం
  • గ్రామంలో పర్యటించి ఇంటింటి సర్వే చేపట్టిన అధికారులు
తెలంగాణలో పూర్తి సౌరశక్తితో నడిచే తొలి గ్రామంగా కొండారెడ్డిపల్లి రూపుదిద్దుకోనుంది. ఈ గ్రామం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం. 100 శాతం సౌరశక్తితో నడిచే ఆవాసాలకు నమూనాగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఈ గ్రామాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారుల బృందం ఈ రోజు గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టింది.

టీజీఎస్పీడీసీఎల్ చైర్మ‌న్, ఎండీ ముషార‌ఫ్ ఫ‌రూఖీ, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా క‌లెక్ట‌ర్ సంతోష్, రెడ్కో వీసీ, ఎండీ అనిల్, సంస్థ డైరెక్ట‌ర్ కె.రాములు, ఇత‌ర శాఖ‌ల ముఖ్య అధికారులు ఈరోజు కొండారెడ్డిప‌ల్లి గ్రామంలో ప‌ర్య‌టించారు. గ్రామ‌స్తులు, రైతులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌తో అధికారులు మాట్లాడి, ఈ పైల‌ట్ ప్రాజెక్టు వివ‌రాలు తెలిపారు. 

ఈ గ్రామంలో దాదాపు 499 గృహ వినియోగదారులు, 66 వాణిజ్య వినియోగదారులు, 867 వ్యవసాయ వినియోగదారులు, ఇతర కేట‌గిరిల‌తో కలుపుకుని మొత్తం 1,451 వినియోగదారులు ఉన్నారు. 

ఈ మోడల్ ప్రాజెక్ట్ అమలు చేసేందుకు నేడు ఇంటింటి స‌ర్వేను ప్రారంభించారు. ఈ స‌ర్వే ద్వారా గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి డీపీఆర్ త‌యారు చేసి, ఇత‌ర ప్ర‌క్రియ‌ల‌ను ముందుకు తీసుకెళ్లనున్నారు.
Kondareddypalli
Telangana
Solar Power Village

More Telugu News