Bihar: యూట్యూబ్ లో చూసి ఆపరేషన్ చేసిన నకిలీ వైద్యుడు.. బీహార్ లో బాలుడి మృతి

Bihar Teen Dies After Fake Doctor Relies On YouTube Videos For Surgery

  • వాంతులు అవుతున్నాయని వెళితే ఆపరేషన్ చేశాడంటున్న తల్లిదండ్రులు
  • తమ అనుమతి కూడా తీసుకోలేదని వెల్లడి
  • బాబు ఆరోగ్యం విషమించగా వేరే ఆసుపత్రికి తరలించే యత్నం
  • మార్గమధ్యలోనే బాలుడు మృతి.. పరారీలో వైద్యుడు

బీహార్ లో నకిలీ వైద్యుడు ఒకరు యూట్యూబ్ లో చూసి ఆపరేషన్ చేశాడు.. పద్నాలుగేళ్ల బాలుడిపై ఆయన చేసిన ప్రయోగం వికటించింది. బాలుడి ఆరోగ్యం విషమించడంతో అంబులెన్స్ లో వేరే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. మార్గమధ్యలోనే బాలుడు చనిపోవడంతో నకిలీ వైద్యుడు పారిపోగా.. మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బీహార్ లోని సారణ్ జిల్లాలో చోటుచేసుకుందీ దారుణం.. జిల్లా కేంద్రానికి చెందిన 15 ఏళ్ల బాలుడు కృష్ణ కుమార్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. పదే పదే వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కుమార్ ను గణపతి హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

ఆసుపత్రిలో చేర్పించిన కాసేపటికే కుమార్ వాంతులు తగ్గిపోయాయి. అయితే, అక్కడి వైద్యుడు అజిత్ కుమార్ పురి మాత్రం ఆపరేషన్ చేయాలని చెప్పాడు. వాంతులు తగ్గిపోయాయి కదా అని అడిగినందుకు తమపై కేకలు వేశాడని, డాక్టర్ నేనా, మీరా అని ఆగ్రహం వ్యక్తం చేశాడని కృష్ణ కుమార్ తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. ఆపై తమ అనుమతి తీసుకోకుండానే యూట్యూబ్ లో చూస్తూ ఆపరేషన్ మొదలు పెట్టాడని వివరించారు. ఆ తర్వాత కృష్ణ కుమార్ పరిస్థితి విషమంగా మారడంతో అంబులెన్స్ లో పాట్నాలోని పెద్దాసుపత్రికి తరలించే ప్రయత్నం చేశాడన్నారు. కొంతదూరం వెళ్లాక కృష్ణకుమార్ చనిపోవడంతో అంబులెన్స్ ను వెనక్కి తిప్పారని చెప్పారు.

తిరిగి ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చి మృతదేహాన్ని మెట్లపై వదిలేసి డాక్టర్ అజిత్ కుమార్ పురి పారిపోయాడన్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుడి తల్లిదండ్రులు, వారి బంధువులతో కలిసి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేంత వరకూ మృతదేహానికి అంత్యక్రియలు చేయబోమని తేల్చిచెప్పారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు డాక్టర్ అజిత్ కుమార్ పురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Bihar
Fake Doctor
YouTube Videos
Surgery
Boy Death
  • Loading...

More Telugu News