KTR: జైనూర్ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

KTR serious on Jainoor issue
  • హోంమంత్రి లేకపోవడం వల్లే శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందన్న కేటీఆర్
  • అందుకే జైనూర్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్య
  • లక్ష పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మగ్ధూం అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణకు  పూర్తిస్థాయి హోం మంత్రి లేక‌పోవ‌డం వ‌ల్లే శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. అందుకే జైనూర్ లాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.

జైనూర్‌లో జరిగిన హింసాత్మక చర్యల్లో అనేక ఆస్తుల విధ్వంసం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత మహిళకు కేవలం లక్ష రూపాయల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని విమర్శించారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ముందస్తు సమాచారం ఉన్నా వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పేర్కొన్నారు.

జైనూర్‌లో తక్షణమే శాంతి నెలకొనేలా రాష్త్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి, నిందితుడికి కఠిన శిక్షపడేలా చూడాలన్నారు. అల్లర్లలో ఇళ్లు, షాపులు కోల్పోయినవారికి సాయంగా నిలవాలన్నారు. పూర్తిస్థాయి హోం మంత్రి లేకుండానే తొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని నడపడం వల్లనే తరచూ ఇటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
KTR
Jainoor
Telangana
BRS

More Telugu News