Chandrababu: విధిలేక బురదలోకి దిగాడు.. వెకిలిగా మాట్లాడుతున్నాడు: జగన్ పై చంద్రబాబు ఫైర్

With no other option Jagan landed in mud says Chandrababu
  • గతంలో వరదలు వచ్చినప్పుడు జగన్ రెడ్ కార్పెట్ పై సందర్శించారన్న చంద్రబాబు
  • ఏం మాట్లాడినా ప్రజలు వింటారనే భావనలో ఉన్నారని ఎద్దేవా
  • క్రిమినల్స్ గండ్లు పెడతారని గట్టుపై పోలీస్ పెట్రోలింగ్ పెట్టామని వెల్లడి
విజయవాడ వరదలపై వైసీపీ అధినేత జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ ఫీల్డ్ లోకి వచ్చారా? అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఒకసారి వరదలు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ పై సందర్శించారని మండిపడ్డారు. ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో బురదలోకి దిగారని ఎద్దేవా చేశారు. 

బుడమేరుకు గేట్లు ఉన్నాయని జగన్ అంటున్నారని... బుడమేరుకు గండ్లు పడ్డాయనే విషయం కూడా వాళ్లకు తెలియదని విమర్శించారు. మా ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరుకు నీటిని పంపించామని జగన్ అంటున్నారని... ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నాడో అని దుయ్యబట్టారు. ఏం చెప్పినా జనాలు వింటారనే భావనలో ఉన్నారని అన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వెకిలిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరదల గురించి మాట్లాడే అర్హత కూడా జగన్ కు లేదని అన్నారు.

రెండు బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయని... ఓ విధంగా ఇది ప్రమాదమే అయినప్పటికీ, దీని వెనుక కుట్ర ఉందని ఎంతో మంది అనుమానిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. క్రిమినల్స్ రాజకీయాల్లో ఉంటే ప్రజలకు రోజూ అనుమానాలే వస్తాయని అన్నారు. సొంత బాబాయ్ ని హత్య చేసి గుండెపోటు అని చెప్పిన వాళ్లు ఏమైనా చేస్తారని వ్యాఖ్యానించారు. రేపల్లె వద్ద ఉన్న బండ్ కు ఈ క్రిమినల్స్ గండ్లు పెడతారనే అనుమానంతో పోలీస్ పెట్రోలింగ్ పెట్టామని తెలిపారు. 

అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ, నీలి మీడియా పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన పార్టీని ఎప్పుడూ చూడలేదని అన్నారు. బుడమేరుకు పడ్డ గండ్లను గత వైసీపీ హయాంలో పూడ్చలేదని... ఈ కారణం వల్లే కట్టలు తెగి సింగ్ నగర్ ను పూర్తిగా ముంచేసిందని చెప్పారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Floods

More Telugu News