Jagan: ఇవి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన వరదలు: జగన్

Jagan take a dig at alliance govt amid floods in Vijayawada
  • విజయవాడ సింగ్ నగర్ లో పర్యటించిన జగన్
  • వరద బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వెల్లడి
  • ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదని విమర్శలు
  • వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణ
ఇవాళ ఇడుపులపాయలో వైఎస్సార్ కు నివాళులు అర్పించిన అనంతరం వైసీపీ అధ్యక్షుడు జగన్ విజయవాడ వచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

ఈ వరద నష్టం వెనుక చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని, వాయుగుండం కారణంగా భారీ వర్షాలు పడతాయని ఈ నెల 28నే వాతావరణ శాఖ చెప్పిందని, కానీ ఆ హెచ్చరికలను చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. ఇవి ప్రభుత్వ అలసత్వం వల్ల వచ్చిన వరదలు అని స్పష్టం చేశారు. వరద బాధితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎటు చూసినా నీరే కనిపిస్తోందని, బాధితులు ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని... ఒక్కరికి కూడా ప్రభుత్వ ఆర్థిక సాయం అందలేదని మండిపడ్డారు. కనీసం తినడానికి తిండి కూడా లేదని, ఎవరిని కదిలించినా కన్నీరు పెట్టుకుంటున్నారని, వారి కన్నీరు కూటమి ప్రభుత్వానికి కనిపించలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గతంలో ఇంతకంటే భారీ వర్షాలు కురిసినా, వాలంటీరు వ్యవస్థ సాయంతో పరిస్థితులను చక్కదిద్దామని చెప్పారు. ఇవాళ విజయవాడ సింగ్ నగర్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వం అరకొర ఏర్పాట్లు చేస్తే ఎలా సరిపోతాయని జగన్ ప్రశ్నించారు. 

లక్షల సంఖ్యలో వరద బాధితులు ఉంటే, 6 పునరావాస శిబిరాలు ఎలా సరిపోతాయని నిలదీశారు. విజయవాడలో వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చూస్తే, ప్రభుత్వం స్పందించిన తీరు ఏమాత్రం ఆయోదయోగ్యం కాదని విమర్శించారు. 


Jagan
Floods
Vijayawada
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News