Amanatullah Khan: ఢిల్లీ వక్ఫ్‌బోర్డు కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్ ఇంటిపై ఈడీ దాడి.. విరుచుకుపడుతున్న నేతలు

ED became BJPs weapon to spoil atmosphere in Delhi says AAP
  • బీజేపీ చేతిలో ఈడీ అస్త్రంగా మారి ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేసిందన్న ఆప్ నేతలు
  • అమానతుల్లాఖాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకున్నా మోదీ నియంతృత్వం, ఈడీ గూండాయిజం కొనసాగుతోందని విమర్శ
  • అక్రమాలకు పాల్పడితే సమాధానం చెప్పాల్సిందేనన్న బీజేపీ
ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ నివాసంపై ఈడీ ఈ ఉదయం దాడి చేసింది. ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంటే ఆయన ఇంటి బయట పోలీసులు, పారామిలటరీ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ సందర్భంగా అమానతుల్లాఖాన్ తన ఎక్స్‌ ఖాతాలో ఈ విషయాన్ని చెబుతూ తనను అరెస్ట్ చేసేందుకు ఇప్పుడే ఈడీ అధికారులు తన ఇంటికి వచ్చారని పేర్కొన్నారు.

కాగా, అమానతుల్లా ఇంటిపై ఈడీ సోదాలను ఆప్ తీవ్రంగా ఖండించింది. బీజేపీ చేతిలో అస్త్రంగా మారిపోయిన ఈడీ ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని మండిపడింది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను ఈడీ అణచివేస్తోందని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా విమర్శించారు. తమకు లొంగని వారిని ఈడీ కటకటాల వెనక్కి పంపిస్తోందని ఆరోపించారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. అమానతుల్లాఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా ప్రధాని మోదీ నియంతృత్వం, ఈడీ గూండాయిజం కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఆప్ నేతల విమర్శలపై బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ మాట్లాడుతూ.. అమానతుల్లాఖాన్ నివాసంపై ఈడీ సోదాలను సమర్థించారు. ఆప్‌లో అవినీతి నేతల గ్రూపు ఒకటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిపై చట్టం తనపని తాను చేస్తుంటే వారు అరవడం మొదలుపెడతారని విమర్శించారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమాలకు పాల్పడిన అమానతుల్లాఖాన్ ఈడీ చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మంవడిపడ్డారు. అక్రమాలకు పాల్పడితే సమాధానం చెప్పాల్సిందేనని, చట్టానికి ప్రతి ఒక్కరు సమానమేనని పేర్కొన్నారు.
Amanatullah Khan
ED
AAP
BJP
Delhi Waqf Board

More Telugu News