Chiranjeevi: నేను ఆ సినిమా చేయడానికి బాలకృష్ణ ఆదర్శం.. ఆయనతో ఫ్యాక్షన్ మూవీ చేస్తా: చిరంజీవి 

Balakrishna is inspiration for me to do faction movie says Chiranjeevi
  • 'సమరసింహారెడ్డి' స్ఫూర్తితో 'ఇంద్ర' సినిమా చేశానన్న చిరంజీవి
  • బాలయ్య 50 ఏళ్ల వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందన్న మెగాస్టార్
  • మరో 50 ఏళ్లు హీరోగా నటించే ఘనత బాలయ్య సొంతమని కితాబు
తాను ఫ్యాక్షన్ సినిమా చేయడానికి బాలకృష్ణ ఆదర్శమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 'సమరసింహారెడ్డి' సినిమా స్ఫూర్తితోనే తాను 'ఇంద్ర' సినిమా చేశానని చెప్పారు. బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలనే కోరిక తనకు ఉందని, కచ్చితంగా చేస్తానని తన మనసులోని ఆకాంక్షను వెల్లడించారు. బాలయ్య చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... సినీపరిశ్రమ ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ స్వర్ణోత్సవ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. 

ఈ కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగిస్తూ... బాలయ్య 50 ఏళ్ల వేడుకలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇది కేవలం బాలయ్యకు సంబంధించిన వేడుక మాత్రమే కాదని... యావత్ తెలుగు సినీ పరిశ్రమ వేడుక అని అన్నారు. బాలకృష్ణ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. 

ఎన్టీఆర్ కు ప్రజల మనసులో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని... తండ్రి చేసిన పాత్రలను ఆయన వారసుడిగా బాలయ్య చేసి, ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా బాలయ్య తన ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు. మరో 50 ఏళ్లు హీరోగా నటించే ఘనత బాలయ్య సొంతమని చిరంజీవి అన్నారు. భగవంతుడు ఇదే శక్తిని ఆయనకు ప్రసాదించాలని... బాలయ్య 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు. 

తమ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా బాలయ్య తప్పకుండా వస్తారని... తమతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారని చిరంజీవి తెలిపారు. ఫ్యాన్స్ అనవసరంగా గొడవ పడుతుంటారని... హీరోల మధ్య మంచి అనుబంధం ఉంటుందని తెలియజేసేందుకు తాము కొన్ని వేడుకలు కూడా చేసుకునేవాళ్లమని చెప్పారు. అలాంటి కార్యక్రమాల వల్ల అభిమానులు కూడా కలిసికట్టుగా ఉంటారని తెలిపారు. తామంతా ఒక కుటుంబంలాంటి వాళ్లమని... ఈ విషయాన్ని ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని చెప్పారు.
Chiranjeevi
Balakrishna
Tollywood

More Telugu News