Chandrababu: విజయవాడలో వరద ముంపు ప్రాంతాలను బోటులో వెళ్లి పరిశీలించిన సీఎం చంద్రబాబు

Chandrababu visits flood hit areas in Vijayawada

  • బుడమేరు ఉగ్రరూపం
  • విజయవాడ సింగ్ నగర్, ఇతర ప్రాంతాలు నీట మునక
  • వరద బాధితులకు ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష 

కుండపోత వర్షాలతో విజయవాడ నగరం నీట మునిగింది. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు వరద ముంపు ప్రాంతాలను బోటులో వెళ్లి పరిశీలించారు. బుడమేరు పొంగి ముంపునకు గురైన సింగ్ నగర్ ప్రాంతానిక వెళ్లి బాధితులను పరామర్శించారు. 

ఎవరూ అధైర్య పడొద్దని, తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తనను చూసి చేతులూపుతున్న వరద బాధితులను ఉద్దేశించి... "మీరేమీ బాధపడొద్దు... అన్నీ నేను చూసుకుంటాను" అంటూ సంజ్ఞల ద్వారా స్పష్టం చేశారు. 

ఇక సింగ్ నగర్ లో గండి పూడ్చడంపై అధికారులతో మాట్లాడారు. ముందు, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా నివారించాలని సూచించారు. అనంతరం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన చంద్రబాబు... మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

వరద బాధితుల కష్టాలు తీర్చేంత వరకు విశ్రమించేది లేదని దిశానిర్దేశం చేశారు. పాలు, ఆహారం, నీళ్లు, కొవ్వొత్తులు, టార్చి లైట్లు తెప్పించి, బాధితులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. లక్ష మందికి సరిపోయే ఆహారం సిద్ధం చేయాలని, బాధితులకు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. 

మొదట, అందుబాటులో ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్ వెంటనే పంపిణీ చేయాలని తెలిపారు. విజయవాడలో ఉన్న అన్ని షాపుల నుంచి వాటర్ బాటిళ్లు తెప్పించాలని పేర్కొన్నారు. ఆహారం గురించి అక్షయ పాత్ర, ఇతర ఏజెన్సీలను సంప్రదించాలని, ఖర్చు గురించి ఆలోచన చేయొద్దని తేల్చి చెప్పారు. 

బుడమేరకు ఊహించని స్థాయిలో వరద రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందిద్దాం అని అధికారులకు నిర్దేశించారు.

More Telugu News