Chandrababu: ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu takes up review on heavy rains
  • బంగాళాఖాతంలో వాయుగుండం
  • ఏపీలో విస్తారంగా వర్షాలు
  • ఓర్వకల్లులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం రద్దు
  • అమరావతి నుంచి ఉన్నతాధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ 
పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరాన్ని దాటనుంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా, తమ్మిలేరు, గోస్తనీ, ఏలేరు, వంశధార, శబరి, వరాహ, శారద, సువర్ణముఖి నదుల్లో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. 

బ్యారేజీలు, రిజర్వాయర్ల నుంచి అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

రాష్ట్రంలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకున్నారు. ఓర్వకల్లులో ఆయన ఇవాళ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. వర్షాల కారణంగా చంద్రబాబు అమరావతి నుంచి సమీక్ష చేపట్టారు. దాంతో ఓర్వకల్లులో సీఎం పాల్గొనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం రద్దు చేశారు. 

కాగా, ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో, పలు శాఖల అధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ చేపట్టారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ సమీక్షకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రజల ఇబ్బందులు తగ్గించవచ్చని తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ చెరువుల పరిస్థితిని పరిశీలించాలని పేర్కొన్నారు. 

వర్షాల కారణంగా పట్టణాల్లో రోడ్లపైకి నేరు చేరి ట్రాఫిక్ కు అవాంతరాలు ఏర్పడుతున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.  

వర్షాల కారణంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని... ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. భారీ వర్షాలపై ప్రజలకు ఫోన్ల ద్వారా అలర్ట్ సందేశాలు పంపాలని ఆదేశించారు. ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా కల్పించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. 

ముఖ్యంగా, తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా చూడడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలుషిత ఆహారం ఘటన చోటుచేసుకుందని, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. కలుషిత ఆహారం ఘటనకు గల కారణాలపై విచారణ జరపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 

సీజనల్ వ్యాధుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థంగా పనిచేయాలని నిర్దేశించారు. జ్వరాల బారిన పడిన గిరిజనులకు వైద్యం అందేలా చూడాలని తెలిపారు.
Chandrababu
Review
Heavy Rains
Andhra Pradesh

More Telugu News