V Srinivas Goud: రేవంత్ రెడ్డి జిల్లాలోనే అర్ధరాత్రి వేళ ఇళ్లను కూల్చేశారు: శ్రీనివాస్ గౌడ్ మండిపాటు

Srinivas Goud fires at demolitions of houses in Mahaboobnagar
  • పేదలు, కుంటివారు, గుడ్డివారి గుడిసెలను కూల్చేశారని మండిపాటు
  • నోటీసులు ఇవ్వకుండానే ఎలా కూల్చేశారని నిలదీత
  • కాంగ్రెస్ మార్క్ పాలన ఇదేనా? అని ప్రశ్న
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే అర్ధరాత్రిపూట పేదలు, దివ్యాంగుల ఇళ్లను కూల్చివేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. 

ఇవాళ బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మహబూబ్ నగర్ పట్టణ సమీపంలో పేదలు, కుంటివారు, గుడ్డివారు గుడిసెలు వేసుకొని ఉంటున్న ఇళ్లను కూల్చివేశారని మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండానే ఎలా కూల్చివేశారని ప్రశ్నించారు.

అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఫోన్లు లాక్కొని, జేసీబీలతో ఇళ్లను కూల్చేశారన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఉండే కోటీశ్వరుల ఇళ్లు అనుకున్నారా? ఏమిటి? అని ప్రశ్నించారు. వీరిని చూస్తే కనికరం ఎందుకు కలగలేదు? అని ఆవేదన శ్రీనివాస్ గౌడ్ వ్యక్తం చేశారు. 

డబ్బు ఉన్న వాళ్లకు కనీసం నోటీసులు అయినా ఇస్తున్నారు కదా... కానీ వీరి ఇళ్లకు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేశారని ధ్వజమెత్తారు. ధనికులకు ఓ న్యాయం... పేదవారికి ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ మార్క్ పాలన ఇదేనా? అని శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇళ్లు కూల్చేసిన బాధితులకు ఇళ్లను కట్టించి ఇవ్వాలని లేదంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
V Srinivas Goud
Telangana
BRS
HYDRA

More Telugu News