Rahul Gandhi: రాయ్‌బరేలీ, వయనాడ్‌లో పోటీ కోసం రాహుల్‌గాంధీకి రూ. 1.4 కోట్లు ఇచ్చిన పార్టీ

Rahul Gandhi got One and Half crore from Congress for contesting in Lok Sabha Polls
  • అభ్యర్థులకు ఇచ్చిన పార్టీ ఫండ్ వివరాలను ఈసీకి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
  • రాహుల్‌కు ఒక్కో స్థానానికి రూ. 70 లక్షలు అందజేత
  • నటి కంగనపై పోటీ చేసిన విక్రమాదిత్యకు అత్యధికంగా రూ. 87 లక్షలు
  • ఈసీ ప్రతిపాదనలపై అభ్యర్థుల ఖర్చును పెంచిన కేంద్రం
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. ఈ ఎన్నికల సందర్భంగా రాహుల్‌కు పార్టీ నుంచి ఎంత మొత్తం అందిందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి తెలియజేసింది. ఒక్కో స్థానం కోసం రాహుల్‌కు రూ. 70 లక్షల చొప్పున మొత్తం రూ. 1.4 కోట్లను పార్టీ ఫండ్‌గా ఇచ్చినట్టు తెలిపింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ నటి కంగన రనౌత్‌పై పోటీ చేసిన విక్రమాదిత్య సింగ్‌ పార్టీలోనే అత్యధికంగా రూ. 87 లక్షలు అందుకున్నారు.  బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీని ఓడించిన కిషోరీలాల్ శర్మ, కేసీ వేణుగోపాల్ (అళప్పుళ, కేరళ), మాణికం ఠాగోర్ (విరుధునగర్, తమిళనాడు), కర్ణాటకలోని గుల్బర్గా నుంచి బరిలోకి దిగిన రాధాకృష్ణ, పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి పోటీ చేసిన విజయ్ ఇందర్ సింగ్లాకు చెరో రూ. 70 లక్షలు అందించింది.  

కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆనంద శర్మ, దిగ్విజయ్ సింగ్‌ వరుసగా రూ. 46 లక్షలు, రూ. 50 లక్షలు అందుకున్నారు. రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి విజయం సాధించిన రాహుల్‌గాంధీ వయనాడ్ సీటుకు రాజీనామా చేసి యూపీ స్థానాన్ని అట్టేపెట్టుకున్నారు.  కాగా, ఎన్నికల సంఘం 2022లో చేసిన ప్రతిపాదన మేరకు ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల ఖర్చును రూ. 70 లక్షల నుంచి రూ. 95 లక్షలకు, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చును రూ. 28 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచింది.
Rahul Gandhi
Raebareli
Wayanad
Congress
Election Commission

More Telugu News