Bengaluru: బెంగ‌ళూరులో షాకింగ్ ఘ‌ట‌న‌.. 8 ఏళ్ల బాలిక కడుపులోంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ క్రికెట్‌ బాల్‌ సైజు హెయిర్ బాల్‌!

Bengaluru Doctors Remove Cricket Ball sized Hairball from 8 Year old Girl Stomach
  • బాలిక‌ ట్రైకోఫాగియా అనే అరుదైన వ్యాధితో బాధప‌డుతున్న‌ట్లు గుర్తించిన వైద్యులు
  • ఈ వ్యాధి ఉన్న‌వారికి జుట్టు తినే కంపల్సివ్ అలవాటు ఉంటుంద‌న్న డాక్ట‌ర్లు
  • అరుదైన ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన బెంగళూరులోని ఆస్టర్స్ చిల్డ్రెన్స్ అండ్ ఉమెన్ ఆసుప‌త్రి
బెంగళూరులో ఓ అరుదైన ఘ‌ట‌న వెలుగు చూసింది. 8 ఏళ్ల బాలిక కడుపులో నుంచి క్రికెట్‌ బాల్‌ సైజులో ఉన్న హెయిర్ బాల్‌ను వైద్యులు ఆప‌రేష‌న్ చేసి తొలగించారు. కాగా, బాధిత బాలిక‌ ట్రైకోఫాగియా అనే అరుదైన వ్యాధితో బాధప‌డుతున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి ఉన్న‌వారికి జుట్టు తినే కంపల్సివ్ అలవాటు ఉంటుంద‌ట‌. దీన్నే రాపుంజెల్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారని వైద్యులు వెల్ల‌డించారు.

ఇక బాధిత‌ బాలిక‌ గత రెండేళ్లుగా ఆకలి లేకపోవడం, తరచుగా వాంతులు చేసుకోవడం వంటివి చూసి ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దాంతో వారు ఆమెను పీడియాట్రిషియన్‌లు, జనరల్ ఫిజిషియన్‌లు, ఈఎన్‌టీ స్పెషలిస్టులతో సహా అనేక మంది వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. కానీ, ఎలాంటి ఫ‌లితం ద‌క్క‌లేదు. ఎక్క‌డికిపోయినా... బాలిక ఆరోగ్య‌ పరిస్థితిని గ్యాస్ట్రైటిస్‌గా భావించి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇవ్వ‌డం చేశారు.

ఈ క్ర‌మంలో బెంగళూరులోని ఆస్టర్స్ చిల్డ్రన్స్ అండ్ ఉమెన్ ఆసుప‌త్రిలోని వైద్యులు ఆమెకు ట్రైకోబెజోర్ ఉన్న‌ట్లు గుర్తించారు. బాలిక‌ జీర్ణాశయాంతర ప్రేగులలో భారీ మొత్తంలో జుట్టు పేరుకుపోయిన‌ట్లు గుర్తించి వెంట‌నే స‌ర్జ‌రీకి ఏర్పాట్లు చేశారు. ఓపెన్ స్ట‌మక్ ఆప‌రేష‌న్ చేసి హెయిర్ బాల్‌ను తొలగించారు. 

“ట్రైకోబెజోర్ అనేది చాలా అరుదైనది. ముఖ్యంగా చిన్న పిల్లలలో చాలా అరుదు. ఇది తరచుగా ట్రైకోఫాగియాతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది వ్యక్తులు జుట్టును తినే మానసిక రుగ్మతకు దారితీస్తుంది. సాధారణంగా యుక్తవయస్సులో ఉన్న బాలికలలో క‌నిపిస్తుంది. కానీ, చాలా చిన్న పిల్లలలో కనుగొనడం ఈ కేసు ప్రత్యేకత” అని పీడియాట్రిక్ సర్జన్‌, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మంజీరి సోమశేఖర్ ఐఏఎన్ఎస్‌తో చెప్పారు.
Bengaluru
Cricket Ball
Hairball
Stomach

More Telugu News