NCRB Report: షాకింగ్ రిపోర్ట్.. జ‌నాభా పెరుగుద‌ల రేటు క‌న్నా విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల రేటే అధికం!

More Students are Committing Suicides in India than Population Growth rate says NCRB Report
  • గ‌త ద‌శాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు 4 శాతం పెరిగాయ‌న్న‌ ఎన్‌సీఆర్‌బీ  
  • అలాగే మొత్తం ఆత్మహత్యల సంఖ్య 2 శాతం పెరిగిందని వెల్ల‌డి
  • గత దశాబ్దం (2013-22)లో 1,04,000 మంది విద్యార్థుల ఆత్మహత్య 
  • అంతకు ముందు దశాబ్దం (2003-12)తో పోలిస్తే 64 శాతం పెరుగుద‌ల‌
భార‌త్‌లో ఏడాదికి స‌గ‌టున జ‌నాభా పెరుగుద‌ల రేటు క‌న్నా విద్యార్థుల ఆత్మ‌హ‌త్యల రేటు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) బుధ‌వారం వెల్ల‌డించిన నివేదిక ద్వారా తెలిసింది. ఐసీ3 కాన్ఫరెన్స్ అండ్‌ ఎక్స్‌పో 2024లో 'స్టూడెంట్ సూసైడ్స్: ఎపిడెమిక్‌  స్వీపింగ్ ఇండియా' పేరిట విడుద‌ల చేసిన‌ నివేదికలో గ‌త ద‌శాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు 4 శాతం పెరిగిన‌ట్లు తేలింది. అలాగే మొత్తం ఆత్మహత్యల సంఖ్య 2 శాతం పెరిగిందని రిపోర్ట్‌ పేర్కొంది.  

"జనాభా పెరుగుదల రేటును విద్యార్థుల ఆత్మహత్యలు అధిగమించడం కొనసాగుతోంది. గత దశాబ్దంలో 0-24 సంవత్సరాల వయస్సు గల వారి జనాభా 58.2 కోట్ల‌ నుండి 58.1 కోట్ల‌కు తగ్గింది. అయితే విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 6,654 నుండి 13,044కి పెరిగింది" అని నివేదిక తెలిపింది. 

గత దశాబ్దంలో (2013-22) సుమారు 1,04,000 మంది విద్యార్థుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇది అంతకు ముందు దశాబ్దం (2003-12)తో పోలిస్తే 64 శాతం పెరిగాయంది. 

దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, అండమాన్ మరియు నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు అత్యధికంగా 29 శాతంగా ఉన్నాయ‌ని రిపోర్ట్ పేర్కొంది. 

ఇండియాలోని మొత్తం ఆత్మహత్యల కేసుల్లో 49 శాతం కేసులు మహారాష్ట్ర (1,764), తమిళనాడు (1,416), మధ్యప్రదేశ్ (1,340), ఉత్తరప్రదేశ్ (1,060), ఝార్ఖండ్ (824) రాష్ట్రాల్లోనే ఉన్నాయంది.  

2022లో జరిగిన మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో సగానికిపైగా (53 శాతం) పురుష‌ విద్యార్థులే ఉన్న‌ట్లు నివేదిక తెలిపింది. అయితే, 2021-22 మధ్యకాలంలో మగ విద్యార్థుల ఆత్మహత్యలు 6 శాతం తగ్గగా, మహిళల ఆత్మహత్యలు 7 శాతం పెరిగాయని రిపోర్ట్ వెల్ల‌డించింది.
NCRB Report
Students
Suicides
Population Growth Rate

More Telugu News