Chandrababu: తెలంగాణ టీడీపీలో అన్ని కమిటీలను రద్దు చేసిన చంద్రబాబు

Chandrababu cancels all committees in Telangana TDP
  • హైదరాబాదులో టీ-టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
  • తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చ
  • సభ్యత్వాల నమోదు పెంచాలని సూచన
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీపై నేతలకు దిశానిర్దేశం
  • చంద్రబాబును కలిసిన బాబూమోహన్
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. తెలంగాణలో పార్టీ  పరిస్థితిపై చర్చించారు. పార్టీ బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో మాట్లాడారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వాల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 

కాగా, తెలంగాణ టీడీపీలోని అన్ని కమిటీలను చంద్రబాబు రద్దు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో కొత్త కమిటీలను నియమిస్తామని తెలిపారు. ఆన్ లైన్ లో సభ్యత్వాల నమోదుకు కార్యకర్తలు ఉత్సాహం చూపించాలని పిలుపునిచ్చారు. 

టీడీపీలో యువతను ప్రోత్సహిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. యువరక్తంతో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి హైదరాబాద్ వస్తానని, అందరి అభిప్రాయాలు తీసుకుంటానని తెలిపారు. కష్టపడినవారికే పార్టీలో ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. తెలుగుజాతి నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు వెల్లడించారు. 

అటు, మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూమోహన్ నేడు హైదరాబాదులో చంద్రబాబును కలిశారు. త్వరలోనే బాబూమోహన్ టీడీపీలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Chandrababu
TDP
Telangana
Andhra Pradesh

More Telugu News