Cybercrime: రూ.175 కోట్లు కాజేశారు... హైదరాబాద్ లో భారీ సైబర్ చౌర్యం!

Huge cyber fraud takes place in Hyderabad
  • షంషీర్ గంజ్ ఎస్ బీఐ బ్రాంచిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు
  • 6 నకిలీ అకౌంట్ల ద్వారా భారీ ఎత్తున లావాదేవీలు
  • 2 నెలల కాలంలో రూ.175 కోట్ల అక్రమ లావాదేవీలు
  • క్రిప్టో కరెన్సీ, హవాలా మార్గాల్లో డబ్బు విదేశాలకు తరలింపు
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
సైబర్ కేటుగాళ్లు హైదరాబాద్ లోని ఓ ఎస్ బీఐ బ్రాంచిని లక్ష్యంగా చేసుకుని పంజా విసిరారు. ఏకంగా రూ.175 కోట్లు కాజేశారు. హైదరాబాద్ లోని షంషీర్ గంజ్ ఎస్ బీఐ బ్రాంచిలో రూ.175 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్టు సైబర్ క్రైమ్ బ్యూరో గుర్తించింది. 

సైబర్ నేరగాళ్లు 6 నకిలీ అకౌంట్ల ద్వారా ఈ లావాదేవీలు నిర్వహించారు. కేవలం రెండు నెలల వ్యవధిలో ఈ ఖాతాల ద్వారా భారీ  ఎత్తున లావాదేవీలు నిర్వహించారు. కాగా, సైబర్ నేరగాళ్లకు సహకరించిన అహ్మద్ షాహిబ్, బిన్ అహ్మద్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు యువకులు నకిలీ అకౌంట్ల ద్వారా దుబాయ్ కు నగదు బదిలీ చేసినట్టు గుర్తించారు. 

క్రిప్టో కరెన్సీ రూపంలో, హవాలా మార్గాల్లో డబ్బును విదేశాలకు తరలించారు. కొంత నగదు డ్రా చేసి మరో అకౌంట్ లో డిపాజిట్ చేశారు. నిందితులు లావాదేవీలు నిర్వహించిన 6 ఖాతాలకు 600 కంపెనీలతో లింకులు ఉన్నట్టు విచారణలో తేలింది. దీనిపై సైబర్ క్రైమ్ విభాగం మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.
Cybercrime
SBI
Shamsheer Gunj
Hyderabad

More Telugu News