Revanth Reddy: చెరువులకు పట్టిన చెర విడిపిస్తాం: రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy On Lake Encroachments
  • చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని హెచ్చరిక
  • అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలే స్ఫూర్తి
  • హరేకృష్ణ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం
చెరువులను చెరబట్టిన వారి నుంచి విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి వస్తున్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలను కూలగొడుతున్నట్లు తెలిపారు. చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతామని హెచ్చరించారు. ఈమేరకు ఆదివారం హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. విధ్వంసానికి పాల్పడితే ప్రకృతి మనమీద కక్ష కడుతుందని వ్యాఖ్యానించారు. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న శ్రీకృష్ణుడి మాటలే తనకు స్ఫూర్తి అని చెప్పారు. భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నట్లు వెల్లడించారు. 

మారథాన్‌ విజేతలకు బహుమతులు అందజేత
‘ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌’ మారథాన్‌ విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి గచ్చిబౌలి మైదానంలో బహుమతులు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. క్రీడా కార్యక్రమాలకే గచ్చిబౌలి స్పోర్ట్స్‌ విలేజ్‌ను వినియోగిస్తామని తెలిపారు. 2028 లో జరగబోయే ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించేలా కృషి చేస్తున్నామని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక ఖేలో ఇండియా నిర్వహణను తెలంగాణకు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. 2036 ఒలింపిక్స్‌ నిర్వహణ బిడ్డింగ్‌ను భారత్‌ గెలిస్తే హైదరాబాద్‌లో గేమ్స్‌ నిర్వహించే అవకాశం ఇవ్వాలని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy
Encroachments
Lakes
Hyderabad

More Telugu News