West Godavari District: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం.. ప్రేమజంటకు పెళ్లి చేసి ఆశ్రయం కల్పించినందుకు పెట్రోలు పోసి నిప్పంటించే యత్నం

Youth Attacked By Young Girl Family Members For Giving Shelter
  • జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో ఘటన
  • ప్రేమజంటకు ఆశ్రయం ఇచ్చినందుకు యువకుడి ఇంటిపై యువతి కుటుంబ సభ్యుల దాడి
  • భయపడి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట
  • వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్న పోలీసులు
ప్రేమజంటకు పెళ్లి చేసి ఆశ్రయం కల్పించడమే ఆ కుటుంబం తప్పయింది. యువతి తరపు కుటుంబ సభ్యులు ఆ కుటుంబంపై దాడిచేశారు. యువకుడిపై పెట్రోలు పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటకు చెందిన ప్రేమికులు పెద్దలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని వేరే ప్రాంతంలో ఉంటున్నారు. యువకుడి బంధువైన మైసన్నగూడేనికి చెందిన రాజు వారికి ఆశ్రయం కల్పించాడన్న కోపంతో యువతి తరపు బంధువులు నిన్న ఆయన ఇంటిపై దాడిచేశారు. ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. 

ఈ క్రమంలో తప్పించుకునే ప్రయత్నం చేసిన రాజుపై పెట్రోలు పోసి సజీవ దహనం చేసే ప్రయత్నం చేయగా స్థానికులు కల్పించుకుని అడ్డుకున్నారు. అక్కంపేట సర్పంచ్ పారేపల్లి నాగేంద్రతోపాటు మరో 50 మందికిపైగా తనపై దాడిచేసినట్టు బాధితుడు రాజు ఆరోపించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన తన తల్లి కనకదుర్గ, మేనత్త శశిరేఖపైనా నిందితులు దాడిచేసినట్టు రాజు పేర్కొన్నాడు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు, దాడి విషయం తెలిసి ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.  
West Godavari District
Jangareddigudem
Lovers
Crime News

More Telugu News