యోగి ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ఈ నెల జీతాలు కోల్పోయే ప్రమాదంలో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు!
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తులను ప్రకటించాలని యోగి ప్రభుత్వం కీలక ఆదేశాలు
- ఆస్తుల వివరాలు తెలిపేందుకు ఈ నెల 31 ఆఖరి గడువుగా పేర్కొన్న సర్కార్
- యూపీలో మొత్తం 17.8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు
- ఇప్పటివరకు తమ ఆస్తులను ప్రకటించిన కేవలం 26 శాతం మంది ఉద్యోగులు
- మిగిలిన 13 లక్షల మంది ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే ఈ నెల జీతాలను కోల్పోయే ప్రమాదం
ఈ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయన్న సీఎస్
యూపీ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ సింగ్ ఈ ఉత్తర్వును ప్రభుత్వ ఉద్యోగలందరూ కచ్చితంగా పాటించాల్సిందేనని అన్నారు. గడువులోపు తమ ఆస్తుల వివరాలను సమర్పించిన ఉద్యోగులకు మాత్రమే వారి జీతాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ నిబంధన అన్ని వర్గాల అధికారులు, ఉద్యోగులకు వర్తిస్తుందని తెలిపారు. తమ ఆస్తులను ప్రకటించని వారు ప్రమోషన్లకు అనర్హులుగా మారే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
"ఈ చర్య ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అవినీతి పట్ల మేము జీరో-టాలరెన్స్ పాలసీని కలిగి ఉన్నాం" అని యూపీ మంత్రి డానిశ్ ఆజాద్ అన్సారీ ఎన్డీటీవీతో అన్నారు.