Diarrhea: శ్రీ సత్యసాయి జిల్లాలో కోరలు చాస్తున్న అతిసారం.. నాలుగు రోజుల్లో ముగ్గురి మృతి!

Diarrhea Prevalent in Sri Sathyasai District Of Andhra Pradesh
  • జిల్లాలోని రొళ్ల మండలం ఎం.రాయపురం గ్రామంలో అతిసారం మృత్యు ఘంటికలు
  • నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే గ్రామానికి చెందిన రత్నాచారి, పార్వతమ్మ, హనుమంత రాయప్ప మృతి 
  • తీవ్ర‌ భయందోళనలలో స్థానికులు
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో అతిసారం కోరలు చాస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ముగ్గురిని పొట్ట‌నబెట్టుకుంది. మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం ఎం.రాయపురం గ్రామంలో ఇలా ముగ్గురు అతిసారం కార‌ణంగా మృతిచెందారు. దీంతో స్థానికులు భయందోళనలకు గురవుతున్నారు. 

గత శనివారం నుంచి గ్రామంలో పలువురు విరేచనాలు, వాంతులు చేసుకుంటూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో డీఎం అండ్ హెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివ‌రాలు అడిగి తెలుసుకుని, చికిత్స అందించ‌డం చేస్తున్నారు. అలాగే పాఠశాలల్లోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 

ఇక అతిసారంతో శనివారం నుంచి బెంగుళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందిన‌ రత్నాచారి (65), పార్వతమ్మ (54)లు సోమవారం రాత్రి చ‌నిపోయారు. అలాగే శిరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హనుమంత రాయప్ప (75) అనే వృద్ధుడు మంగళవారం మృతి చెందాడు. 

ఇలా ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు కేవలం నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే ప్రాణాలు కోల్పోవ‌డం భయందోళనలకు కార‌ణ‌మ‌వుతోంది. గత వారంలో నియోజకవర్గంలోని కొంకలు గ్రామంలో అతిసారం లక్షణాలతో మరణాలు మరవకముందే, తిరిగి రాయపురంలో అతిసారం ప్రబలడం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

దీంతో జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ గ్రామంలో పర్యటించి వైద్య సిబ్బందిని అల‌ర్ట్ చేశారు. దీనిలో భాగంగా నీటి బోరు వద్ద పైప్ లైన్ లీకేజీ నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు.
Diarrhea
Sri Sathyasai District
Andhra Pradesh

More Telugu News