Fake NCC Camp: ఎన్ సీసీ క్యాంప్ పేరుతో బాలికలపై లైంగిక వేధింపులు.. తమిళనాడులో ఘటన

13 Girls Sexually Abused At Fake NCC Camp Teachers Principal Arrested
  • స్కూలు కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ సహా 11 మంది అరెస్టు
  • క్యాంప్ ఏర్పాటు చేస్తే ఎన్ సీసీ గుర్తింపు వస్తుందని నమ్మించిన దుండగులు
  • విచారించకుండానే స్కూలులో క్యాంప్ ఏర్పాటు చేసిన స్కూలు యాజమాన్యం
  • వేధింపులు జరిగాయని తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అధికారుల ఆగ్రహం
తమిళనాడులో ఓ ప్రైవేటు స్కూలులో ఫేక్ ఎన్ సీసీ క్యాంపు పెట్టి పదమూడు మంది బాలికలను దుండగులు లైంగికంగా వేధించారు. క్యాంపు ఏర్పాటు చేస్తే ఎన్ సీసీ గుర్తింపు లభిస్తుందని చెప్పిన దుండగుల మాటలకు స్కూలు యాజమాన్యం బోల్తా పడింది. ఎవరినీ విచారించకుండానే క్యాంప్ ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వడం, నిర్వహణ మొత్తం దుండగులకే వదిలివేయడంతో బాలికలు వేధింపులకు గురయ్యారు. క్యాంప్ పూర్తయిన తర్వాత బాలికలు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా.. విషయాన్ని పెద్దది చేయొద్దంటూ వారిని బెదిరించారు. గత నెలలో కృష్ణగిరిలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పిల్లల తల్లిదండ్రులు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు స్కూలు కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఇద్దరు టీచర్లతో పాటు క్యాంప్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
 
స్కూలులో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఎన్ సీసీ క్యాంపులో 17 మంది బాలికలు సహా మొత్తం 41 మంది స్టూడెంట్లు పాల్గొన్నారు. ఇందులో బాలికలకు స్కూలు ఫస్ట్ ఫ్లోర్ లో, బాలురకు గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్వాహకులు బస ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ నిర్వాహణకు పర్మిషన్ ఇచ్చిన స్కూలు యాజమాన్యం.. ఆ తర్వాత ఎలాంటి పర్యవేక్షణ చేబట్టలేదు. క్యాంప్ బాధ్యతలు మొత్తం దుండగులకే అప్పగించింది. దీంతో బాలికలను ఆడిటోరియంలోకి పిలిచి వేధింపులకు పాల్పడ్డారు. క్యాంప్ ముగిసిన తర్వాత జరిగిన విషయాన్ని బాలికలు తమ టీచర్ల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలిసిన ప్రిన్సిపాల్ కూడా క్యాంప్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోవాలని బాలికలను బెదిరింపులకు గురిచేశారు. విషయం బయటపడడంతో పోలీసులు మొత్తం 11 మందిపై కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎన్ సీసీ క్యాంపు పేరుతో దుండగులు మిగతా స్కూళ్లలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ పి థంగదురై మీడియాకు వెల్లడించారు.
Fake NCC Camp
Girls Abused
Sexual Assualt
Tamilnadu
Principal Arrest

More Telugu News