Tungabhadra: దేశ సాగునీటి రంగంలోనే తొలిసారి.. విజయవంతంగా తుంగభద్ర డ్యాం స్టాప్‌లాగ్ గేటు బిగింపు

Stoplog Gate installed in place of damaged gate at Tungabhadra reservoir
  • వరద పోటు కారణంగా 10న కొట్టుకుపోయిన గేటు
  • 30 వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి
  • విరిగిన గేటు పైనుంచి నీటి ప్రవాహం కొనసాగుతుండగానే స్టాప్‌‌లాగ్ గేటు బిగింపు
  • దేశ సాగునీటి చరిత్రలో ఇలా ఇదే తొలిసారి
  • సంబరాలు చేసుకున్న ఇంజినీర్లు, అధికారులు
ఇంజినీర్లు అద్భుతం చేశారు. తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన 19వ క్రస్టుగేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటును విజయవంతంగా అమర్చారు. దీంతో నీటి వృథాకు అడ్డుకట్ట పడింది. ఈ నెల 10న వరద పోటు కారణంగా గేటు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి కొత్త గేటును అమర్చేందుకు ఇంజినీర్లు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. గేట్ల రూపకల్పనలో నిపుణుడైన కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో ఇంజినీర్ల బృందం నిన్న స్టాప్‌లాగ్‌ గేటును బిగించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రక్రియ గత రాత్రితో పూర్తయింది.

మొత్తం ఐదు స్టాప్‌లాగ్ ఎలిమెంట్లలో శుక్రవారం ఒకటి బిగించగా, నిన్న మిగతా నాలుగింటిని బిగించారు. గేటు కొట్టుకుపోయినప్పటి నుంచి గేటు బిగించే వరకు మొత్తంగా 30 వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. మొదటి ఎలిమెంట్ బిగించిన తర్వాత కూడా కొంత నీరు వృథా అయింది. అయితే, రెండోది అమర్చాక నీటి వృథాకు అడ్డుకట్ట పడింది.    

మరో వారం రోజుల్లో జలాశయం మళ్లీ కళకళ
గేటు బిగింపు పూర్తయ్యాక డ్యాం గేట్లన్నింటినీ మూసివేశారు. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో మరో వారం రోజుల్లో జలాశయం మళ్లీ నీటితో కళకళలాడే అవకాశం ఉంది. ప్రస్తుతం 84 వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. కాబట్టి ఖరీఫ్‌ సాగునీటికి ఎలాంటి ఇబ్బందీ లేదని చెబుతున్నారు.

దేశ సాగునీటి రంగంలోనే తొలిసారి

నిజానికి స్టాప్‌లాగ్ గేటు బిగించడం కొత్తేమీ కాకపోయినా డ్యాంలోని నీటి ప్రవాహం కొనసాగుతుండగానే గేటును బిగించడం మాత్రం ఇదే తొలిసారి. గేటు బిగింపు విజయవంతం కావడంతో ఇంజినీర్లు డ్యాంపైనే సంబరాలు చేసుకున్నారు. 

చంద్రబాబు చొరవతోనే
నిజానికి చంద్రబాబు చొరవతోనే గేటు బిగింపు ఇంత త్వరగా పూర్తయింది. తుంగభద్ర నీటితో ఏపీ రైతుల ప్రయోజనాలు ముడిపడి ఉండడంతో ఆయన వెంటనే స్పందించారు. మంత్రులను పంపి కర్ణాటక అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో జలాశయ నిపుణుడు కన్నయ్యనాయుడుతో చర్చలు జరిపారు. కర్ణాటక ప్రభుత్వంతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్‌ను ప్రత్యామ్నాయ చర్యలకు ఒప్పించారు. గేటును ఒకేసారి అమర్చడం కష్టంతో కూడుకున్న పని కావడంతో ఒకేసారి కాకుండా గేటును ఐదు భాగాలుగా చేసి బిగించాలని నిర్ణయించారు. విరిగిన గేటు పైనుంచి పది అడుగుల మేర నీరు వెళ్తుండగానే స్టాప్‌లాగ్ గేటును బిగించారు. నీటి ప్రవాహం కొనసాగుతుండగానే గేటు బిగింపు ఇదే తొలిసారని ఇంజినీర్లు తెలిపారు.
Tungabhadra
Stoplog Gate
Karnataka
Andhra Pradesh
Chandrababu

More Telugu News