KTR: క్షమాపణ చెప్పినప్పటికీ నోటీసులు వచ్చాయి... 24న మహిళా కమిషన్ ఎదుట హాజరవుతా: కేటీఆర్

KTR says he was received notices
  • కాంగ్రెస్ హయాంలో మహిళలపై జరుగుతున్న దాడులను కమిషన్‌కు వివరిస్తానని వెల్లడి
  • 8 నెలలుగా దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారో అడుగుతానన్న కేటీఆర్
  • రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో టచ్‌లోకి వెళ్లారన్న కేటీఆర్
తెలంగాణ మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులు తనకు అందాయని, ఈ నెల 24న కమిషన్ ముందు హాజరవుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తనకు ఈ మెయిల్ ద్వారా ఈ నోటీసులు అందాయన్నారు. 24న ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట హాజరై, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై జరిగిన దాడులను వివరిస్తానని వెల్లడించారు.

ఎనిమిది నెలలుగా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారో మహిళా కమిషన్‌ను అడుగుతానన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు గాను నిన్ననే బహిరంగ క్షమాపణ చెప్పానని... అయినప్పటికీ తనకు నోటీసులు ఎందుకు ఇచ్చారో తెలియదన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అన్నారు. తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేతలు అన్న మాటలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళతానన్నారు.

ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి టచ్‌లోకి వెళ్లారు...

సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ టచ్‌లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. తాను చనిపోయే సమయానికి బీజేపీలోనే ఉంటానని మోదీకి చెప్పినట్లుగా తెలిసిందన్నారు. ప్రధానితో అలా అన్నారో లేదో... ముఖ్యమంత్రి చెప్పాలని నిలదీశారు. 

రుణమాఫీపై క్షేత్రస్థాయికి వెళతాం

కాంగ్రెస్ పార్టీ చేసిన రుణమాఫీకి సంబంధించి తాము క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు సేకరిస్తామని కేటీఆర్ అన్నారు. తాము సేకరించిన డేటాను కలెక్టర్, సీఎస్‌లకు అందిస్తామన్నారు. ఎల్లుండి నుంచి డేటాను సేకరించి వారంలో పూర్తి చేస్తామని వెల్లడించారు.
KTR
Revanth Reddy
Telangana
Narendra Modi

More Telugu News