Harish Rao: తెలంగాణ ప్రజలకు నా చరిత్ర తెలుసు... రేవంత్ రెడ్డి చరిత్ర కూడా తెలుసు: హరీశ్ రావు

Harish rao says TG people know about Revanth Reddy
  • రైతు రుణమాఫీ పాక్షికంగా చేశామని చెబితే అంగీకరిస్తామన్న మాజీ మంత్రి
  • కానీ పూర్తిగా రుణమాఫీ చేశామంటే ఒప్పుకునేది లేదని వ్యాఖ్య
  • రుణమాఫీకి సంబంధించి నేరుగా రైతుల వద్దకే వెళ్లి అడుగుదామా? అని సవాల్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తన చరిత్ర తెలుసునని... అలాగే సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర కూడా తెలుసునని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రైతు రుణమాఫీ పాక్షికంగా చేశామని ప్రభుత్వం చెబితే అంగీకరిస్తామని, కానీ పూర్తిగా చేశామంటే ఒప్పుకునేది లేదన్నారు. రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత రూ.17 వేల కోట్లు మాత్రమే చేసిందన్నారు.

రైతులకు రూ.14 వేల కోట్లు కోత పెట్టారని విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా చేయకుండానే తనను రాజీనామా చేయమని డిమాండ్ చేయడం విడ్డూరమన్నారు. క్షమాపణ చెప్పాల్సింది, రాజీనామా చేయాల్సింది తాను కాదని... పాక్షిక రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రుణమాఫీకి సంబంధించి నేరుగా రైతుల వద్దకే వెళ్లి అడుగుదామా? అని ప్రశ్నించారు.

పాక్షిక రుణమాఫీ చేసి తనను రాజీనామా చేయమని అడగడం ఏమిటన్నారు. అసలు కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మాట చెప్పి... తప్పిందెవరు? అని ప్రశ్నించారు. ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర తనది అన్నారు. రుణమాఫీ సహా ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేస్తే రాజీనామా చేస్తానని చెప్పానని... కానీ ఏదీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22 లక్షల మందికి రుణమాఫీ చేసి... 26 లక్షల మందికి మొండిచేయి చూపిందన్నారు.
Harish Rao
Revanth Reddy
Telangana

More Telugu News