Taxpayers: ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఐటీ శాఖ హెచ్చ‌రిక‌... అప్ర‌మ‌త్తంగా లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేన‌ట‌!

Income tax department warns taxpayers on fake messages and mails
  • ఐటీఆర్ రిఫండ్ స్కామ్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రిక‌
  • అనధికార, అనుమానాస్పద ఈ-మెయిల్స్ పై క్లిక్ చేయవద్దన్న ఐటీ శాఖ‌
  • ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన ఈ-మెయిల్  ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలని సూచ‌న‌
ఐటీఆర్ రిఫండ్ స్కామ్స్‌ పట్ల ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని ఐటీ శాఖ హెచ్చరించింది. నకిలీ కాల్స్, సందేశాల‌ పట్ల జాగ్ర‌త్తగా ఉండాలని సూచించింది. ఒకవేళ పన్ను చెల్లింపుదారులకు ఫేక్ సందేశాలు వస్తే గుడ్డిగా నమ్మి మోసపోవద్దని, అధికారిక ఛానళ్ల ద్వారా నిర్ధారించుకోవాల‌ని ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా హెచ్చరించింది.

"అనధికార, అనుమానాస్పద ఈ-మెయిల్స్‌పై క్లిక్ చేయవద్దు. అలాగే వాటికి ఎలాంటి సమాధానం ఇవ్వవద్దు. మీ క్రెడిట్ కార్డు నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఇతర విలువైన‌ సమాచారాన్ని అడిగే వెబ్‌సైట్లను ఓపెన్ చేయవద్దు. ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన ఈ-మెయిల్ చిరునామా ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలి" అని ఐటీ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ఈ సంద‌ర్భంగా సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే మెసేజ్‌లు ఎలా ఉంటాయో కూడా ఐటీ శాఖ తెలిపింది. "మీకు రూ.15000 ఆదాయపు పన్ను రిఫండ్ అప్రూవ్ అయ్యింది. ఈ మొత్తం త్వరలో మీ ఖాతాకు జమ అవుతుంది. దయచేసి మీ ఖాతా నంబర్ 5XXXXXX6777ను ధృవీకరించండి. ఇది సరైనది కాకుంటే, ఇక్కడ ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్‌ చేయండి" అని ఆ స్కామ‌ర్ల‌ నుంచి సందేశం లేదా మెయిల్ రావచ్చని ఆదాయపు పన్ను విభాగం హెచ్చరించింది. అలాంటి సందేశాలకు ఎట్టిప‌రిస్థితుల్లో స్పందించవద్దని సూచించింది.

మోసపూరిత ఈ-మెయిల్స్‌పై ఫిర్యాదు చేయ‌డం ఇలా..

మోసపూరిత ఈ-మెయిల్ వస్తే, మీరు దానిని [email protected] కు పంపించాలి. అలాగే ఒక కాపీని [email protected] కూడా పంపవచ్చు. మీకు ఫేక్‌ మెయిల్ వస్తే, దానిని [email protected] కు పంపించండి అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. 

ఇక ఆదాయపు పన్ను శాఖ అని చెప్పుకునే ఎవరి నుంచైనా ఈ-మెయిల్ లేదా ఫోన్ కాల్ వస్తే వాటికి సమాధానం ఇవ్వొద్దని సూచించింది. అలాగే ఈ- మెయిల్ లో ఏదైనా అటాచ్‌మెంట్ లు ఉంటే, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని, సందేశం లింక్ ను కట్ చేసి మీ బ్రౌజర్లలో పేస్ట్ చేయవద్దని హెచ్చరించింది. అలాగే ఓటీపీ, పాస్‌వ‌ర్డ్‌, ఆధార్ వంటి సున్నిత‌మైన స‌మాచారాన్ని ఎట్టిప‌రిస్థితుల్లో స్కామ‌ర్ల‌కు వెల్ల‌డించ‌వ‌ద్ద‌ని తెలిపింది.  

ఐటీ రీఫండ్ ఎప్పుడు వస్తుందంటే!

పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్‌లను ఈ-వెరిఫై చేసిన తర్వాతే ఆదాయపు పన్ను రిఫండ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే సాధారణంగా రిఫండ్ బ్యాంక్ ఖాతాల్లో జమ కావడానికి దాదాపు 4-5 వారాల సమయం పడుతుంది. ఒక వేళ 'డిఫెక్టివ్ ఐటీఆర్' నోటీస్ వస్తే, దానిని మళ్లీ కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.


Taxpayers
Income tax department
Fake Messages
Fake Mails

More Telugu News