Parliament: పార్లమెంట్​ గోడ దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించిన యువకుడు.. !

Man scales wall Jumps Inside Parliament Annexe building premises Arrested
  • మరోసారి బ‌య‌ట‌ప‌డ్డ పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం 
  • ఇంతియజ్‌ ఖాన్‌ మార్గ్‌ వైపున్న గోడ దూకి పార్లమెంట్‌ అనెక్స్‌ భవనం పరిసరాల్లోకి ప్రవేశించిన యువ‌కుడు
  • యువ‌కుడిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేసిన‌ సీఐఎస్ఎఫ్
  • నిందితుడు యూపీలోని అలీఘర్‌కు చెందిన మనీశ్‌గా గుర్తింపు
గతేడాది పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సంద‌ర్భంగా లోక్ సభలోకి ఇద్దరు దుండగులు దూసుకెళ్లడం కలకలం రేపింది. తాజాగా మరోసారి పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం బ‌య‌ట‌ప‌డింది. ఓ యువకుడు పార్లమెంట్‌ గోడ దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించాడు. శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంటు అనెక్స్ భవనం ఆవరణలో గోడ దూకి లోపలికి వ‌చ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 

శుక్రవారం మధ్యాహ్నం జ‌రిగిన‌ ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మ‌ధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఓ 20 ఏళ్ల యువకుడు ఇంతియజ్‌ ఖాన్‌ మార్గ్‌ వైపున్న గోడ దూకి పార్లమెంట్‌ అనెక్స్‌ భవనం పరిసరాల్లోకి ప్రవేశించాడు.

అలా గోడ దూకి లోప‌లికి ప్ర‌వేశించిన ఆ యుకుడిని గ‌మ‌నించిన‌ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిందితుడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని నిర్థార‌ణ అయిన‌ తర్వాత ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన మనీశ్‌గా గుర్తించారు. 

సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడ అధికారులు అతడిని ప్రశ్నించారు. ఎత్తుగా ఉన్న ఆ గోడను ఎలా ఎక్కాడు? అని తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీస్‌ అధికారి తెలిపారు. అలాగే ఎందుకు పార్లమెంట్‌ ప్రాంగణంలోకి ప్రవేశించాడన్న దానిపై కూడా దర్యాప్తు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. కాగా, మనీశ్‌ తన పేరును సరిగ్గా చెప్పలేక‌పోవ‌డంతో అత‌ని మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

గత ఏడాది డిసెంబర్ 13న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల వేళ లోక్ సభలోకి ఇద్దరు దుండగులు దూసుకెళ్లడం కలకలం రేపిన విష‌యం తెలిసిందే. లోక్ సభలోని పబ్లిక్‌ గ్యాలరీ వద్ద కూర్చున్న ఇద్దరు యువకులు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. పసుపు రంగు పొగను వెదజల్లుతూ ఎంపీల‌ను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ సంఘటన తర్వాత పార్లమెంట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
Parliament
Annexe Building
New Delhi

More Telugu News