Balakrishna: నిన్న అమ్మను, ఈరోజు నాన్నను తలుచుకున్నా: బాలకృష్ణ

Balakrishna opens Anna Canteens in Hindupur
  • హిందూపురంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన బాలకృష్ణ
  • ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు అమలు చేస్తున్నారని కితాబు
  • హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలని వ్యాఖ్య
హిందూపురం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎనలేని అభిమానం ఉందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆ అభిమానంతోనే ఇక్కడ పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేశారని చెప్పారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని సీఎంను కోరుతామని తెలిపారు. జిల్లాకు సత్యసాయి పేరును అలాగే ఉంచి... జిల్లా కేంద్రంగా హిందూపురంను చేయాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తామని చెప్పారు. 

సత్యసాయి జిల్లా హిందూపురంలో రెండు చోట్ల అన్న క్యాంటీన్లను ఈరోజు బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదలకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో తిరిగి టీడీపీ అధికారంలోకి రావడం, అన్న క్యాంటీన్లను ప్రారంభించడం సంతోషంగా ఉందని బాలయ్య చెప్పారు. పేదలకు మూడు పూటలా కడుపునిండా భోజనం అందించాలనే అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. 

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో జాతీయ జెండాను ఎగురవేసి అమ్మను తలుచుకున్నానని... ఈ రోజు అన్న క్యాంటీన్లను ప్రారంభించి నాన్నను తలుచుకున్నానని చెప్పారు.
Balakrishna
Chandrababu
Telugudesam
Anna Canteen

More Telugu News