RG Kar Medical College and Hospital: ‌కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఆసుపత్రిని ధ్వంసం చేసిన ఆందోళనకారులు.. రాత్రి నుంచి ఉద్రిక్తత

Mob rampage at Kolkata hospital where doctor was raped and killed
  • ‘రీ క్లెయిమ్ ది నైట్’ పేరుతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రచారం
  • రాత్రి 11.55 గంటల సమయంలో వీధుల్లోకి వేలాదిమంది మహిళలు
  • బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు
  • ఆసుపత్రిలోకి దూసుకెళ్లి కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేసిన ఆందోళనకారులు
  • బాష్పవాయువు ప్రయోగించి, లాఠీలకు పని చెప్పిన పోలీసులు
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై జరిగిన లైంగిక దాడి, హత్యకు సాక్షిగా నిలిచిన ఈ ఆసుపత్రికి ‘రీ క్లెయిమ్ ది నైట్’ పేరుతో ఆందోళనకారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. లాఠీలకూ పనిచెప్పారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 

‘రీ క్లెయిమ్ ది నైట్’ పేరుతో పశ్చిమ బెంగాల్ సహా దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభమైంది. సోషల్ మీడియా ద్వారా దీనికి విపరీతమైన ప్రచారం లభించింది. గత రాత్రి 11.55 గంటల సమయంలో వేలాదిమంది మహిళలు ప్లకార్లులు చేతబట్టుకుని వీధుల్లోకి వచ్చారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

ఆందోళన తొలుత శాంతియుతంగా సాగింది. అయితే, ఆసుపత్రికి చేరుకున్నాక ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రిని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు. కుర్చీలు, ఇతర ఫర్నిచర్‌ను విరగ్గొట్టారు. ఆసుపత్రి బయట ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎమర్జెన్సీ వార్డును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బయట పార్క్ చేసిన పోలీసు వాహనాలపైనా ప్రతాపం చూపారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్ప వాయువు ప్రయోగించారు. 

కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మాట్లాడుతూ ఈ సోషల్ మీడియా ప్రచారాన్ని ‘హానికరమైన ప్రచారం’గా పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రచారం కారణంగా ఆసుపత్రి వద్ద ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తామేమీ తప్పు చేయలేదని పేర్కొన్నారు.
RG Kar Medical College and Hospital
Reclaim the Night
Kolkata
West Bengal

More Telugu News