Arun Yogiraj: అయోధ్య బాలరాముడి శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు చేదు అనుభవం

US refuses visa to Ayodhya Ram Lalla sculptor Arun Yogiraj
  • యోగిరాజ్‌తో పాటు ఆయ‌న‌ ఫ్యామిలీకి వీసా నిరాకరించిన అమెరికా
  • ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్ 2024కు హాజ‌ర‌య్యేందుకు వీసా ద‌రఖాస్తు చేసిన శిల్పి
  • వీసా నిరాకరణకు ఎలాంటి కారణాలను వెల్లడించని యూఎస్‌
అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయ‌న‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీకి అమెరికా వీసాను నిరాక‌రించింది. అసోసియేషన్ ఆఫ్ కన్నడ కూటాస్ ఆఫ్ అమెరికా ఆధ్వ‌ర్యంలో వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్ 2024 ఈవెంట్ జరగనుంది. 

కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్‌ను ఈ సదస్సుకు ఆహ్వానించారు. దాంతో ఆయ‌న‌ కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేశారు. అయితే, ఆయన వీసాను అమెరికా తిరస్కరించింది. వీసా నిరాకరణకు ఎలాంటి కారణాలను వెల్లడించలేదు.

మైసూరుకు చెందిన ఈ శిల్పి ఈ ఏడాది జనవరిలో అయోధ్య ఆలయంలో ప్రతిష్టించిన 'రామ్ లల్లా' విగ్రహాన్ని చెక్కిన విష‌యం తెలిసిందే. కాగా, మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చదివిన అరుణ్ యోగిరాజ్ ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో ఆరు నెలల పాటు ఉద్యోగం చేశారు. 

కానీ, ఆ త‌ర్వాత ఆ ప్రైవేట్ ఉద్యోగాన్ని గుడ్‌బై చెప్పి మైసూర్‌కు తిరిగి వ‌చ్చేశార‌ట‌. అనంత‌రం కుటుంబ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకుని శిల్పిగా కొన‌సాగుతున్న‌ట్లు ఒక సంద‌ర్భంలో అరుణ్ చెప్పారు. 

ఇక అరుణ్‌ యోగిరాజ్ ఇంతకుముందు కేదార్‌నాథ్‌లో ప్ర‌తిష్ఠించిన‌ 12 అడుగుల ఆది శంకరాచార్య విగ్రహాన్ని, ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా చెక్కారు. 

వీటితో పాటు మైసూర్ జిల్లాలోని చుంచనకట్టెలో 21 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం, 15 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, మైసూర్‌లోని స్వామి రామకృష్ణ పరమహంస తెల్లటి అమృతశిల విగ్రహం, 6 అడుగుల ఎత్తైన నంది ఏకశిలా విగ్రహం ఆయన చెక్కిన విగ్రహాలలో ఉన్నాయి.
Arun Yogiraj
Ayodhya Ram Lalla
Sculptor
USA
Visa

More Telugu News