YS Jagan: దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ కొనసాగాలి.. జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు

Jagan Assets Case Supreme Court Says Continue Investigation
  • జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణరాజు పిటిషన్
  • ఇతరత్రా విషయాల్లోకి వెళ్లకుండా విచారణ మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశం
  • విచారణ నవంబర్‌కు వాయిదా
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని, కాబట్టి విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు (ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే) దాఖలు చేసిన కేసులపై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 

ఈ కేసులో వివిధ వ్యక్తులు దాఖలు చేస్తున్న పిటిషన్లతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. విచారణ కోసం వరుసగా దాఖలవుతున్న దరఖాస్తులపై జస్టిస్ ఖన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతరత్రా విషయాల్లోకి వెళ్లకుండా, దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ మొదలు పెట్టాలని ఆదేశించారు. 

అంతకుముందు రఘురామ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జగన్ అక్రమాస్తుల కేసులో ఎలాంటి పురోగతి లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని 12వ పేరా చూస్తే దిగ్భ్రాంతికి గురవుతారని తెలిపారు. దీనికి జస్టిస్ ఖన్నా స్పందిస్తూ సీబీఐ నివేదికను తాను కూడా చూశానని, బాధ కలిగించిందని పేర్కొన్నారు.

జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో 900 మంది సాక్షులు, లక్షల పేజీల ఫైళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి జస్టిస్ ఖన్నా స్పందిస్తూ.. విచారణలో ఇలాంటివన్నీ సర్వసాధారణమేనని, ఈ కేసు కోసమే సీబీఐ ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని సూచించారు. కేసు విచారణ జాప్యానికి కారణాలు చెప్పవద్దని, మెరిట్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం కేసును నవంబర్‌కు ప్రారంభమయ్యే వారానికి విచారణను వాయిదా వేశారు.
YS Jagan
Jagan Assets Case
Supreme Court
Raghu Rama Krishna Raju
Telugudesam

More Telugu News