Donald Trump: ఎలాన్ మస్క్ కు కీలక ఇంటర్వ్యూ ఇస్తున్నా: డొనాల్డ్ ట్రంప్

Donald Trump says he will give interview to Elon Musk next week
  • మరింత వాడివేడిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల వాతావరణం
  • నువ్వానేనా అంటున్న ట్రంప్, కమలా హ్యారిస్
  • సోమవారం రాత్రి ట్రంప్ ను ఇంటర్వ్యూ చేయనున్న మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, అధికార డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ రేసులో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తెరపైకి వచ్చారు. 

బైడెన్ రేసు నుంచి తప్పుకోకుండా, బరిలో నిలిచి ఉంటే... బలహీన ప్రత్యర్థిపై ట్రంప్ గెలుపు ఖాయం అయ్యేదేమో కానీ, కమలా హ్యారిస్ రంగంలోకి దిగడంతో ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ తప్పదనిపిస్తోంది. 

ఈ నేపథ్యంలో, వచ్చేవారం ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్... డొనాల్డ్ ట్రంప్ ను ఇంటర్వ్యూ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. సోమవారం రాత్రి తాను ఎలాన్ మస్క్ కు కీలక ఇంటర్వ్యూ ఇస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. 

ఎలాన్ మస్క్... ట్రంప్ కు అతి పెద్ద మద్దతుదారుగా ఉన్నారు. సోషల్ మీడియాలో ట్రంప్ ను సమర్థిస్తూ మస్క్ పలు వ్యాఖ్యలు చేస్తుంటారు. దాంతో, ఒక వీరాభిమాని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో... వచ్చే వారం ట్రంప్ ఇంటర్వ్యూ కూడా అలాగే ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ఇటీవల ట్రంప్ తన నివాసంలో లైవ్ స్ట్రీమర్ అడిన్ రోస్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది 'కిక్' అనే స్ట్రీమింగ్ వేదికపై ప్రత్యక్ష ప్రసారం అయింది. ట్రంప్ ఇంటర్వ్యూ పుణ్యమా అని 'కిక్' కు రికార్డు స్థాయిలో వ్యూయర్స్ సంఖ్య పెరిగింది.
Donald Trump
Elon Musk
Interview
US Presidential Polls

More Telugu News