Jagan: నేడు బెంగళూరు నుంచి విజయవాడకు రానున్న జగన్

Jagan will come to Vijayawada from Bengaluru today
  • మంగళవారం సాయంత్రానికి గన్నవరం చేరుకోనున్న వైఎస్ జగన్
  • ప్రత్యర్ధుల దాడిలో గాయపడిన వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావును జగన్ పరామర్శిస్తారని పార్టీ వర్గాల వెల్లడి 
  • రేపు, ఎల్లుండి ఉమ్మడి విశాఖ నేతలతో జగన్ సమావేశమవుతారని తెలిపిన పార్టీ కార్యాలయం
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు బెంగళూరు నుంచి విజయవాడకు రానున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్ధుల దాడిలో తీవ్ర గాయాల పాలైన శ్రీనివాసరావు విజయవాడ సన్‌రైజ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో శ్రీనివాసరావును పరామర్శించి, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు జగన్ వస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గింజుపల్లి శ్రీనివాసరావును నేటి సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.

ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ ఇవాళ సాయంత్రం గన్నవరం చేరుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో నేరుగా విజయవాడలోని సన్ రైజ్ ఆసుపత్రికి ఆయన వెళతారు. అక్కడ శ్రీనివాసరావును పరామర్శించిన అనంతరం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. కాగా, బుధ, గురువారం ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జగన్ వరుసగా సమావేశం అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో బుధ, గురువారం ఇతర ప్రాంత నేతలు ఎవ్వరినీ జగన్ కలవడానికి ఆస్కారం లేదని పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. దీన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తించాలని విజ్ఞప్తి చేసింది.
Jagan
YSRCP

More Telugu News