KTR: ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే?: కేటీఆర్ ఆగ్రహం

KTR fires at Revanth Reddy government
  • దొంగతనం ఒప్పుకోవాలంటూ మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? అన్న కేటీఆర్   
  • రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితి ఉందని వ్యాఖ్య  
  • ఈ ప్రభుత్వానికి ఆడబిడ్డల ఉసురు మంచిది కాదని హెచ్చరిక
ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళపై దాష్టీకం చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'దళిత మహిళపై ఇంత దాష్టీకమా? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళ అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..! ఇంత కర్కశత్వమా... సిగ్గు సిగ్గు..! కొడుకు ముందే చిత్ర హింసలా?' అంటూ మండిపడ్డారు.

రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ రాష్ట్రంలో అసలేం జరుగుతోందని ప్రశ్నించారు. మహిళలంటే ఇంత చిన్నచూపా..! ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు మరోవైపు దాడులు, దాష్టీకాలు..! యథా రాజా తథా ప్రజా అన్నట్లు పాలన ఉందన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు కూడా తామేమీ తక్కువ కాదన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు.

ఈ ప్రభుత్వానికి ఆడబిడ్డల ఉసురు మంచిది కాదని హెచ్చరించారు. వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదు... దౌర్జన్యాలు మాత్రం చేయకండని విజ్ఞప్తి చేశారు. షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని... బాధిత మహిళలకు న్యాయం చేయాలని సూచించారు. దళిత వ్యతిరేక.. మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు.
KTR
Revanth Reddy
BRS

More Telugu News