Indian Railways: విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు కూడా టికెట్ తీసుకోవాల్సిందే: రైల్వే

GRP and RPF personnel must obtain a travel authority or purchase a ticket for train travel
విధుల్లో భాగంగా రైళ్లలో ప్రయాణించే జీఆర్‌పీ (గవర్నమెంట్ రైల్వే పోలీసులు), ఆర్‌పీఎఫ్‌ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) సిబ్బంది తప్పనిసరిగా ఒక ట్రావెల్‌ అథారిటీని (డ్యూటీ కార్డ్ పాస్‌) లేదా టికెట్‌‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందేనని రైల్వే స్పష్టం చేసింది. ఐడీ కార్డుతో ప్రయాణించి విధుల్లో ఉన్నానంటే చెల్లుబాటుకాదని పేర్కొంది. విధుల్లో ఉన్న సమయంలో తాను రైలు నుంచి జారిపడ్డానని, ఒక కాలును కోల్పోయినందున పరిహారం చెల్లించాలంటూ ఓ కానిస్టేబుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ‘రైల్వే క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌’ కొట్టివేసింది. అతడి వద్ద ట్రావెల్ అథారిటీ లేదా రైలు టికెట్ లేకపోవడంతో పరిహారం పొందలేడని స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వే శాఖకు ట్రైబ్యునల్ అహ్మదాబాద్ బెంచ్ స్పష్టం చేసింది.

కాగా రాజేశ్ బగుల్ అనే జీఆర్‌పీ కానిస్టేబుల్ ప్రమాదం జరిగిన రోజున తాను అధికారిక విధుల్లో ఉన్నానని, కాబట్టి వడ్డీ సహా మొత్తం రూ.8 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. నవంబర్ 13, 2019న డ్యూటీ కోసం సూరత్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని చెప్పాడు. సూరత్ నుంచి తిరిగి సూరత్-జామ్‌నగర్ ఇంటర్‌సిటీ రైలులో బరూచ్‌కి వెళ్తున్న సమయంలో పాలేజ్ స్టేషన్‌ దాటాక పడిపోయానని, ఎడమ కాలుకు తీవ్రమైన గాయాలయ్యాయని, కాలుని మోకాలి పైకి వరకు తొలగించాల్సి వచ్చిందని వివరించాడు.

అయితే రాజేశ్ వాదనలను నిరూపించే డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు లేవని రైల్వే వాదించింది. తాను దిగాలనుకున్న స్టేషన్‌ను దాటిన తర్వాత రైలు దిగేందుకు ప్రయత్నిస్తుండగా అతడు జారిపడ్డాడని రైల్వే పేర్కొంది. వాదనలు విన్న ట్రైబ్యునల్ సభ్యుడు (జుడీషియల్) వినయ్ గోయెల్.. రాజేశ్ అధికారిక ప్రయాణం చేసినట్టుగా నిరూపించడానికి సరైన ప్రయాణ ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఆధారాలు అందించడంలో రాజేశ్ విఫలమవడంతో పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొన్నారు. చెల్లుబాటు అయ్యే ట్రావెల్ అథారిటీ లేనప్పుడు పిటిషనర్‌ని ప్యాసింజర్‌గా గుర్తించలేమని జులై 30న స్పష్టం చేసింది.

కాగా తరచూ రైలు ప్రయాణాలు చేసే ప్రభుత్వ రైల్వే పోలీసు సిబ్బందికి డ్యూటీ కార్డ్ పాస్‌ల విషయంలో రైల్వే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని, సంబంధిత సర్క్యులర్‌‌ను ఇంకా జారీ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరగా సర్క్యులర్‌ను జారీ చేయాలని పేర్కొంది.
Indian Railways
Railway Police
GRP
RPF personnel

More Telugu News