Adinarayana Reddy: ఇది జగన్ కు హెచ్చరిక... పెద్దిరెడ్డి సహా అందరూ జైలుకే!: ఆదినారాయణరెడ్డి

BJP MLA Adinarayana Reddy strongly criticises YCP leaders
  • ఐదేళ్ల వైసీపీ పాలనలో ఐదు లక్షల కోట్లు దోచేశారన్న ఆదినారాయణరెడ్డి
  • అక్రమాలకు పాల్పడ్డవారు జైలుకు వెళ్లక తప్పదని స్పష్టీకరణ
  • జగన్ ఒక్కడే రెండు లక్షల కోట్లు తిన్నాడని వ్యాఖ్యలు
ఐదేళ్ల వైసీపీ పాలనలో రూ.5 లక్షల కోట్లు దోచేశారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలు గత ఐదేళ్లలో అంతులేని అక్రమాలకు పాల్పడ్డారని, అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. 

జగన్ తన 60 నెలల పాలనలో ఏనాడు కూడా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని, సమర్థుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందో నిరూపించారని ఆదినారాయణరెడ్డి కొనియాడారు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, సామాజిక పింఛనుదారులకు ఒకటో తేదీనే ఠంచనుగా చెల్లింపులు చేయడం చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శనం అని అభివర్ణించారు. 

60 నెలల కాలంలో జగన్ బటన్ నొక్కాను అని చెప్పడమే తప్ప, చేసిన మంచి పని ఒక్కటీ లేదని విమర్శించారు. తక్కువలో తక్కువగా జగన్ రూ.2 లక్షల కోట్లు తిన్నాడని, మిగతా అందరూ కలిసి రూ.3 లక్షల కోట్ల వరకు తిన్నారని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. 

వైనాట్ 175 అన్నారు... 25కి 25 ఎంపీ స్థానాలు అన్నారు... మొత్తం 200 గెలుస్తామన్నారు... కానీ 200కి గాను వాళ్ల స్కోరు 15 మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఈసారి మాకు 200... మీకు సున్నా అని అర్థం... ఈసారి పులివెందులలో జగన్ ను కూడా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

కొందరు జైల్లో ఉన్నారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు, జగన్ మోహన్ రెడ్డి మాత్రం గాల్లో తిరుగుతున్నారు అని వ్యాఖ్యానించారు. కానీ తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరు... పెద్దిరెడ్డి సహా అందరూ జైలుకుపోయే పరిస్థితి వచ్చింది అని స్పష్టం చేశారు. 

"ఫైళ్లు తగలబెడుతున్నారు... చెత్తకుండీల్లో, కాలువల్లో కూడా ఫైళ్లు దొరుకుతున్నాయి. రెయిడ్లు జరుగుతున్నాయి కదా... కొన్ని కేసులు సీఐడీ, కొన్ని కేసులు ఏసీబీ విచారిస్తున్నాయి... రూ.40 లక్షలకు మించి అవినీతి జరిగితే ఈడీ కూడా ఎంటరవుతుంది. అక్కడ కేజ్రీవాల్ సంగతి చూస్తే అందరూ జైలు పాలయ్యారు. ఇక్కడ లక్ష కోట్ల స్కాం జరిగింది. ఇక్కడ కూడా అవినీతిపరులందరూ అందరూ జైలుకు వెళ్లాల్సిందే... మిమ్మల్ని రాజకీయాల్లోనే లేకుండా చేస్తాం... మీకు ఈసారి సున్నానే... ఇది జగన్ మోహన్ రెడ్డికి హెచ్చరిక. 

విశాఖలో బొత్సను బరిలో దించుతున్నారంట. ఆయన ఓడిపోవడం ఖాయం. ఎక్కడ ఆయన కాంగ్రెస్ లోకి పోతాడో అని భయపడి టికెట్ ఇచ్చినట్టున్నారు. అది పోయే సీటే... అందులో సందేహం లేదు" అంటూ ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.
Adinarayana Reddy
BJP MLA
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News