KTR: విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ 'ఆల్ ది బెస్ట్'

KTR all the best to CM Revanth Reddy
  • పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం బృందం
  • కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అనుకూలమైన వ్యవస్థను రూపొందించామన్న కేటీఆర్
  • రాజకీయాలు పక్కన పెట్టి, తెలంగాణ ఫస్ట్ అనేదే తమ నినాదమని వ్యాఖ్య
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులను ట్యాగ్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన సీఎం బృందం షెడ్యూల్‌ను తాను చూశానన్నారు.

ఏళ్లుగా ఎంతో కష్టపడి తాము పట్టుదలతో సంబంధాలను పెంపొందించామని, ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రముఖ కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణకు ఆసక్తి చూపిస్తున్నాయంటే ఇందుకు తెలంగాణ పారిశ్రామిక విధానాలు, విజయాలే నిదర్శనమని పేర్కొన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆర్థికాభివృద్ధికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు. తాము టీఎస్-ఐపాస్ వంటి అనేక వినూత్న విధానాలు తీసుకువచ్చామని గుర్తు చేశారు. భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాలలో గణనీయమైన పెట్టుబడులు పెట్టామన్నారు. గత దశాబ్దంలో, ఈ ప్రయత్నాల ఫలితంగా రూ.4,00,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించినట్లు తెలిపారు. దీంతో పాటు వివిధ రంగాల్లో 24 లక్షలకు పైగా ప్రైవేట్ రంగ ఉద్యోగాలను సృష్టించామన్నారు.

రాజకీయాలు పక్కన పెట్టి, 'తెలంగాణ ఫస్ట్' అనేదే తమ నినాదం అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యక్ష పెట్టుబడులను తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే బీఆర్ఎస్ నిర్మించిన బలమైన పునాదిని కొనసాగించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
KTR
Revanth Reddy
Telangana
BRS

More Telugu News