Cloudburst: హిమాచల్‌ప్రదేశ్‌లో క్లౌడ్‌బరస్ట్.. కొట్టుకుపోయిన గ్రామం!

Cloudburst Washed Away Entire Village In Himachal Pradesh
  • వరదలకు తుడిచిపెట్టుకుపోయిన సమేజ్ అనే గ్రామం
  • కేవలం ఒక్క ఇల్లు మాత్రమే మిగిలిన వైనం 
  • ‘మేఘ విస్ఫోటనం’తో విలయం సృష్టించిన మెరుపు వరదలు
హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల విలయం సృష్టించిన ‘మేఘ విస్ఫోటనం’ (క్లౌడ్ బరస్ట్) ఒక గ్రామాన్ని సమూలంగా తుడిచిపెట్టేసింది. మెరుపు వరదలలో సమేజ్ అనే గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. కేవలం ఒకే ఒక్క ఇల్లు మాత్రమే మిగిలివుంది. హృదయాన్ని కలచివేసే ఈ విషాద ఉదంతాన్ని అదే గ్రామానికి చెందిన అనితా దేవి అనే మహిళ తెలిపింది. 

బుధవారం రాత్రి తమ కుటుంబ సభ్యులందరం నిద్రిస్తున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, తమ ఇల్లు కదిలిపోయిందని ఆమె చెప్పింది. తాము బయటకు వెళ్లి చూడగా ఊరు మొత్తం కొట్టుకుపోయిందని ఆమె విలపించింది. వెంటనే గ్రామంలోని భగవతి కాళీ మాత ఆలయానికి పరిగెత్తుకెళ్లి రాత్రంతా అక్కడే గడిపామని ఆమె భావోద్వేగంతో చెప్పింది. వర్షం విధ్వంసం నుంచి తమ ఇల్లు మాత్రమే బయటపడిందని, కానీ ఇంట్లోని వస్తువులన్నీ కళ్ల ముందే కొట్టుకుపోయాయని వాపోయారు. ఇప్పుడు తాము ఎవరితో కలిసి జీవించాలో తెలియడంలేదని కన్నీరు పెట్టింది.

సమేజ్ గ్రామానికే చెందిన బక్షి రామ్ అనే వృద్ధుడు కన్నీటి పర్యంతమవుతూ తన బాధను పంచుకున్నాడు. ‘‘నా కుటుంబానికి చెందిన దాదాపు 14 నుంచి 15 మంది వరదలో కొట్టుకుపోయారు. రాంపూర్‌ అనే ఊరిలో ఉన్న నాకు తెల్లవారుజామున 2 గంటల సమయంలో వరదలకు సంబంధించిన సమాచారం అందింది. ఆ సమయంలో వెళ్లలేక తెల్లవారుజామున 4 గంటలకు గ్రామానికి వచ్చాను. నాకు ఆప్యాయతను పంచే కుటుంబ సభ్యుల కోసం ప్రస్తుతం వెతుకుతున్నాను. ఎవరైనా ప్రాణాలతో బతికి ఉంటారేమోనన్న ఆశతో ఎదురుచూస్తున్నాను’’ అని ఆ పెద్దాయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

కాగా డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం.. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఏర్పడిన మెరుపు వరదల ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, మండి, సిమ్లా ప్రాంతాలలో మొత్తం 53 మంది తప్పిపోయారని శనివారం నాటికి తేల్చారు. ఇందులో కేవలం ఆరుగురి మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఇక వరదల కారణంగా 60కిపైగా ఇళ్లు కొట్టుకుపోయాయని, పలు గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయని డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా వెల్లడించారు.

కాగా అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలు కురవడాన్నే మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్‌బరస్ట్‌‌గా పిలుస్తారు. 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెం.మీ (100మి.మీ) వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారిగా ఊహించని స్థాయిలో కురిసే ఈ భారీ వర్షాలు మెరుపు వరదలకు దారితీస్తాయి.
Cloudburst
Himachal Pradesh
Rains
Floods

More Telugu News