Revanth Reddy: సబిత, సునీతలను అక్కలుగా భావించా... ఓ అక్క నన్ను నడిబజారులో వదిలేసింది: రేవంత్ రెడ్డి

Revanth Reddy takes on Sabitha Indra Reddy and Sunitha
  • మరో అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళితే కేసులు కూడా పెట్టారన్న సీఎం
  • తన కోసం ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తేయాలని కూడా ఆ అక్క చెప్పలేదని విమర్శ
  • నన్ను నమ్ముకున్న అక్కలు ఈ రోజు మంత్రులు అయ్యారన్న రేవంత్ రెడ్డి
  • మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలే ఇప్పుడు తీహార్ జైల్లో ఉందన్న సీఎం
సబితా ఇంద్రారెడ్డి, సునీతారెడ్డిలను తాను సొంత అక్కలుగా భావించానని... ఒక అక్క తనను నడిబజారులో వదిలేసినా తాను ఏమీ అనలేదని, మరో అక్క కోసం తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ప్రచారానికి వెళ్లిననాటి కేసుల్లో తాను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నానన్నారు. తన గెలుపు కోసం ప్రచారం చేయడానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తివేయాలని ఆ అక్క ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు.

తనను నమ్ముకొని తన వెంటే ఉన్న అక్కలు ఈరోజు మంత్రులు అయి ముందువరుసలో ఉన్నారని వ్యాఖ్యానించారు. కానీ మరో తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో చూడండని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు. మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలే ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నారని విమర్శించారు. ఉద్య‌మాల నుండి వ‌చ్చిన ఆదివాసీల బిడ్డ సీత‌క్క‌పై బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా పోస్టింగ్స్ చూస్తే చెప్పుతో కొట్టాలనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఆదివాసి బిడ్డ అని తెలిసి అవమానించారా? అని ధ్వజమెత్తారు.

మీ ముందు కింద కూర్చోకూడదని సభకు రావడం లేదు

అసలు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చి గెలిపించిందని, కాంగ్రెస్ గెలిపించిన స్పీకర్‌ను 'అధ్యక్షా' అనడం ఇష్టం లేకే కేసీఆర్ సభకు రావడం లేదని ఆరోపించారు. మీ ముందు కింద కూర్చోవడం ఇష్టం లేకే కేసీఆర్ ఈ సభకు రావడం లేదనుకుంటున్నాం అని స్పీకర్‌ను ఉద్దేశించి అన్నారు. 

దళితులకు సీఎం పదవి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని, ఓ దళిత బిడ్డను ఉపముఖ్యమంత్రి చేసి అవమానకరంగా బర్తరఫ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను అవమానించిన కేసీఆర్ నోటి నుంచి... ఓ దళిత స్పీకర్‌ను 'అధ్యక్షా' అనే స్థాయికి కాంగ్రెస్ తీసుకువచ్చిందన్నారు.
Revanth Reddy
Congress
Telangana
K Kavitha
Sabitha Indra Reddy

More Telugu News