AP High Court: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ ఏఏజీ పొన్నవోలుకు హైకోర్టు నోటీసులు

AP High Court notices to former CID chief Sanjay former AAG Ponnavolu
  • పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా, మీడియా సమావేశాలను నిర్వహించారంటూ ఆరోపణలు 
  • ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ హైకోర్టులో పిల్
  • పిల్‌‌ను పరిశీలించిన హైకోర్టు సీజే ధర్మాసనం
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ .. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతుండగానే తెలంగాణ రాజధాని హైదరాబాద్, దేశ రాజధాని ఢిల్లీలో స్కిల్ కేసుకు సంబంధించి సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియా సమావేశాలను నిర్వహించారు. 

ఈ చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఓ పక్క న్యాయస్థానాల్లో బెయిల్ పిటిషన్‌పై విచారణలు జరుగుతుండగా, వీరు మీడియా సమావేశాలను నిర్వహించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిల్ ను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం .. సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం .. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.
AP High Court
Former AAG Ponnavolu
Former CID chief Sanjay

More Telugu News