Chandrababu: సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ

AP Dy CM Pawan Kalyan met CM Chandrababu in state secretariat
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అటవీశాఖ అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత పవన్... చంద్రబాబును కలిశారు. ఇరువురు పలు శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

అంతకుముందు చంద్రబాబు... పరిశ్రమల శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల శాఖలో గత ఐదేళ్లుగా జరిగిన వ్యవహారాలపై చర్చించారు. 

2014-19 మధ్య టీడీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు 2019 తర్వాత వెనక్కి వెళ్లారని అధికారులు వివరించారు. పరిశ్రమలకు కేటాయించిన భూములు దుర్వినియోగం అయ్యాయని తెలిపారు. 

దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ, కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించేందుకు వారితో తానే మాట్లాడతానని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భూముల లభ్యత, పారిశ్రామిక అనుకూల ప్రాంతాలపైనా ఈ సమీక్షలో చర్చించారు. 

ఆరోగ్యశ్రీపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: మంత్రి కొలుసు పార్థసారథి

ఆరోగ్యశ్రీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేసే పత్రికలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ పథకంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. 

బిల్లులు చెల్లించకపోవడంతో గతంలో అనేక ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని మంత్రి పార్థసారథి వెల్లడించారు. పేదలకు వైద్యం అందకుండా చేసిన అసమర్థ పాలన జగన్ ది అని విమర్శించారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. 

జలవనరుల శాఖపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు తాగు, సాగునీరు విడుదలపై చర్చించారు. కృష్ణా బోర్డుకు తెలిపి నీరు విడుదల చేయాలని మంత్రి నిమ్మల అధికారులకు నిర్దేశించారు. తొలుత తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. 

నెల్లూరు టౌన్ ప్లానింగ్ విభాగంపై దృష్టి సారించిన మంత్రి నారాయణ

ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నెల్లూరు టౌన్ ప్లానింగ్ విభాగంపై దృష్టి సారించారు. భవన నిర్మాణం, లేఅవుట్ల అనుమతుల జారీలో జాప్యం నివారించాలని అధికారులను ఆదేశించారు. 

నెల్లూరు కార్పొరేషన్ లోని పెండింగ్ దరఖాస్తులపై రేపు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొననున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
Chandrababu
Pawan Kalyan
AP Secretariat
TDP-JanaSena-BJP Alliance

More Telugu News