Katipalli Venkata Ramana Reddy: కాంగ్రెస్ ప్రభుత్వమని మీరనుకుంటున్నారు... కానీ నేను తెలంగాణ ప్రభుత్వం అనుకుంటున్నాను: బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

Katipalli Venkataramana Reddy powerfull speech in assembly
  • ఈ ప్రభుత్వంలో మనమంతా సభ్యులమే అన్న బీజేపీ ఎమ్మెల్యే
  • పథకాలపై సోనియా, రాహుల్ గాంధీ ఫొటోలు పెట్టడం లేదు కదా అన్న ఎమ్మెల్యే
  • సీఎం రేవంత్ రెడ్డి సహా మన మంత్రుల ఫొటోలు పెడుతున్నారని వ్యాఖ్య
ఇది కాంగ్రెస్ ప్రభుత్వమని మీరు అనుకుంటే... నేను నా ప్రభుత్వం... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నానని బీజేపీ నేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... ఈరోజు రుణమాఫీ చేశారని, ఏ పార్టీ అయినా మంచిని మంచిగా అంగీకరించాలన్నారు. రుణమాఫీని తాను స్వాగతిస్తున్నానన్నారు. ప్రభుత్వంలో మనమంతా సభ్యులమేనని గుర్తుంచుకోవాలన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమని కొందరు అనుకుంటే తాను మాత్రం తెలంగాణ ప్రభుత్వంగా భావిస్తున్నానన్నారు.

ఈ ప్రభుత్వం మనందరిది... ప్రభుత్వం చేసే కార్యక్రమాలలో పార్టీలకతీతంగా మనం కూడా ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఫొటోలు పెడితే మనం పోకపోవచ్చునని... కానీ మన ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఫొటోలు ఉన్నాయన్నారు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగానే భావిస్తున్నామన్నారు. మీరు కూడా (కాంగ్రెస్ ప్రభుత్వం) అలాగే ఆలోచించాలన్నారు.

నిజాయతీగా గెలవాలనుకున్నా... అందుకే ఇన్నాళ్లు పట్టింది

సభ నడిచేటప్పుడు సీనియర్లు తమలాంటి వారికి మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నానని కాటిపల్లి అన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రిని తాను కోరేది ఒక్కటేనని... అన్నా, రేపటికి మనం మార్గదర్శకంగా ఉందామన్నారు. 'కొత్తగా వచ్చావు.. మారకపోతావా.. మేం చూడకపోతామా అని ఎవరైనా అనుకుంటారేమో... కానీ నేను మారే వ్యక్తిని కాదు' అన్నారు. తాను రాజకీయాలకు కొత్త కాదని, గతంలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా పని చేశానని తెలిపారు.

కానీ నిజాయతీగా గెలవాలనే కారణంతో తాను సభకు రావడానికి ఇన్నాళ్లు పట్టిందన్నారు. వంకర తోవలో గెలవాలనుకుంటే తాను ఎప్పుడో (సభకు) వచ్చేవాడినన్నారు. అయినా సభ్యులు ఇక్కడకు వచ్చాక మారుతున్నారా? అర్థం కావడం లేదన్నారు. ప్రజలతో మాట్లాడినప్పుడు సీరియస్ నెస్ కనిపిస్తుందని, కానీ ఇక్కడకు వచ్చే సరికి సీరియస్‌నెస్ ఉండదా? అన్నది అర్థం కావడం లేదన్నారు.

సభను చూస్తుంటే ఇంటర్ పిల్లలను చూసినట్లుగా ఉంది

అసెంబ్లీ ఎప్పుడూ మర్యాదపూర్వకంగా నడవాలన్నారు. ఓ సభ్యుడు మాట్లాడినప్పుడు 119 మంది సభ్యులు వినాలన్నారు. మనం మాట్లాడింది 119 మంది ఎమ్మెల్యేల ద్వారా తెలంగాణ ప్రజలకు చేరుతుందన్నారు. కానీ 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైతే 12 గంటలకు టీ బ్రేక్ ఇస్తారని, కానీ నిత్యం సభకు వచ్చేవాళ్లు వస్తుంటారు... పోయేవాళ్లు పోతుంటారని, చూస్తుంటే కాలేజీలో ఇంటర్ పిల్లలను చూసినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. టీచర్ అటు చూసేసరికి ఒకరు వెనుక డోర్ నుంచి వెనక్కి జారుకుంటున్నట్లుగా సభలో కనిపిస్తోందన్నారు.

తాను ఎవరినీ అవమానించడం లేదని... చట్టసభలు అంటే తనకు గౌరవం ఉందన్నారు. ఇదే చట్టసభల్లో అందరం చాలా గౌరవంగా ఉండాలన్నారు. కక్షలు, ద్వేషంతో ఉండాలని తాను కోరుకోవడం లేదన్నారు. కానీ మంచిని మంచిగా... చెడును చెడుగా చెప్పాలన్నారు. తిట్టుకోవడం ఎంత సేపు... బయట నేను వేసినంత సెటైర్లు ఎవరూ వేయరు.. కానీ సభలో అలా చేయనన్నారు. తాను ఇప్పటి వరకు సభ గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు.
Katipalli Venkata Ramana Reddy
Telangana
BJP

More Telugu News