Nayanthara: నయనతార మందారపువ్వు టీపై వైద్యుడి ఫైర్.. దీటుగా నయన్ సమాధానం

Actress Nayanthara Strong Reply To Doctor Who Criticised Her
  • మందారపువ్వు టీ డయాబెటిస్, హైబీపీ వంటి వాటిని దూరంగా ఉంచుతుందన్న నయన్
  • అది తనకు ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందని వెల్లడి 
  • మిడిమిడి జ్ఞానాన్ని తన ఫాలోవర్లకు పంచుతున్నారన్న వైద్యుడు
  • ఆమె చెబుతున్న దానికి ఆధారాలు లేవని విమర్శలు
  • తెలివి తక్కువ వారితో వాదించ కూడదని నయన్ పోస్ట్
మందారపువ్వు టీ తాగి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ప్రముఖ నటి నయనతారపై ఓ వైద్యుడు విరుచుకు పడ్డాడు. ఆ వైద్యుడు మరెవరో కాదు.. ఇటీవల సమంతను విమర్శించిన డాక్టరే. ‘ది లివర్ డాక్టర్’ అనే ఎక్స్ ఖాతాలో ఆయన పోస్టు పెట్టారు.

మందారపువ్వుపై ఆమె తనకున్న 8.7 మిలియన్ల ఫాలోవర్లను తప్పుదోవ పట్టిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సమంత తన ఫాలోవర్లను తప్పుదారి పట్టించిన దానికంటే రెండు రెట్లు ఎక్కువగా నయనతార ఆ పని చేస్తోందని మండిపడ్డారు. మందారపువ్వు టీ బాగుంటుందని చెప్పి వదిలేసి ఉంటే అయిపోయేదని, కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెప్పి తన మిడిమిడి జ్ఞానాన్ని జనాలకు కూడా పంచుతున్నారని ఫైరయ్యారు. మందారపువ్వు డయాబెటిస్, హైబీపీ, యాక్నే, యాంటీ బ్యాక్టీరియల్ అంటూ నయనతార చెబుతున్నారని, ఆమె చెప్పిన వాటికి ప్రూఫ్స్ లేవని పేర్కొంటూ, నయనతార పోస్టు ఫొటోలను షేర్ చేశారు.

ఇంతకీ నయన్ ఏమని చెప్పారంటే..
 ‘‘మందారపువ్వు టీ నాకు చాలా ఇష్టం. ఇది ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. దీనిని ఆయుర్వేదంలోనూ చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, అధిక కొలెస్టరాల్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి మొటిమలను నివారిస్తుంది. మందారంలో విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. రోగ నిరోధకశక్తిని సమతుల్యంగా ఉంచుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్, అనారోగ్యం నుంచి రక్షించే యాంటీ బ్యాక్టీరియల్ ఇది. కాబట్టి ఈ టీ తాగండి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి’’ అని నయనతార సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.

తెలివి తక్కువ వారితో వాదించవద్దు
వైద్యుడి విమర్శలపై స్పందించిన నయనతార.. తెలివి తక్కువ వారితో వాదించవద్దు.  ఆ విధంగా మిమ్మల్ని వారి స్థాయికి తీసుకెళ్లి ఓడిస్తారు.. అంటూ అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ చెప్పిన సూక్తిని షేర్ చేసింది. అయితే, ఇందులో నేరుగా వైద్యుడిని ప్రస్తావించనప్పటికీ ఆయనను ఉద్దేశించే నయన్ ఈ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు.
Nayanthara
Hibiscus Flower Tea
Ayurveda
Tollywood

More Telugu News