Raus IAS Academy: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదంపై నెల రోజుల ముందే విద్యార్థి హెచ్చరిక.. స్పందించి ఉంటే ఆ ముగ్గురూ బతికేవారేమో.. వీడియో ఇదిగో!

Month Before Delhi Basement Deaths IAS Aspirants SOS Flagged Huge Risk
  • కోచింగ్ సెంటర్ నిబంధనలకు విరుద్ధంగా బేస్‌మెంట్‌లో తరగతులు నిర్వహిస్తోందని ఐఏఎస్ ఆశావహుడి ఫిర్యాదు
  • విద్యార్థుల ప్రాణాలతో కోచింగ్ సెంటర్ చెలగాటమాడుతోందని ఆవేదన
  • చర్యలు తీసుకోవాలంటూ వారంలో రెండుసార్లు ఫిర్యాదు
  • అతడి ఫిర్యాదు ఇంకా ప్రాసెస్‌లోనే
ఢిల్లీలోని రౌస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు చనిపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమా? వైరల్ అవుతున్న నెల రోజుల క్రితం నాటి వీడియో చూస్తే అదే నిజమని అనిపించకమానదు. అధికారుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండానే రౌస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో లైబ్రరీ నిర్వహిస్తూ విద్యార్థులు, స్టాఫ్ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసిందంటూ కిశోర్ సింగ్ కుష్వాహ అనే ఐఏఎస్ ఆశావహుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌కు లేఖ రాశాడు.

నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండానే రౌస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో తరగతులు నిర్వహిస్తోందని, ఇది పెను ప్రమాదానికి దారితీయవచ్చని కరోల్‌బాగ్ జోన్‌లోని భవన నిర్మాణ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కుమార్ మహేంద్రకు పంపిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యూపీఎస్‌సీ కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కుష్వాహా ఒకసారి కాదు, రెండుసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఎవరూ స్పందించలేదు.

జులై 15న ఫిర్యాదు చేస్తూ.. ‘‘సర్ ఇది చాలా ముఖ్యమైన, అత్యవసరమైన విషయం. దానిపై కఠిన చర్యలు తీసుకోండి’’ అని కోరితే, సరిగ్గా వారం రోజుల తర్వాత 22న ‘‘సర్ చర్యలు తీసుకోండి. ఇది విద్యార్థుల భద్రతకు సంబంధించిన విషయం’’ అని రాసుకొచ్చాడు. కుష్వాహా ఫిర్యాదును ఆన్‌లైన్‌లో పరిశీలించినప్పుడు విషయం ఇంకా ‘ప్రాసెస్’లోనే ఉందని చూపిస్తోంది.  

కుష్వాహా ఫిర్యాదుపై అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, భవన నిర్మాణ విభాగం కానీ.. వీరిలో ఎవరు స్పందించినా ముగ్గురి విలువైన ప్రాణాలు మిగిలి ఉండేవి. వారి తల్లిదండ్రులకు కడుపు కోత తప్పేది.
Raus IAS Academy
New Delhi
Kishor Singh Kushwah
Flood Water
MCD

More Telugu News