Dog Meet: బెంగళూరు హోటళ్లలో కుక్క మాంసం వడ్డిస్తున్నారా...?

Some groups alleges supply of dog meet to Bengaluru hotels
  • బెంగళూరులోని కొన్ని హోటళ్లకు కుక్క మాంసం సరఫరా అవుతోందంటూ ఆరోపణలు
  • రాజస్థాన్ నుంచి రైళ్లలో తీసుకువస్తున్నట్టు తెలిపిన కొన్ని సంఘాలు
  • మటన్ లో కుక్క మాంసం కలిపి వడ్డిస్తున్నారన్న హిందుత్వ కార్యకర్త పునీత్ కేరేహళ్లి 
బెంగళూరులోని కొన్ని హోటళ్లకు కుక్క మాంసం సరఫరా అవుతోందన్న ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. వెంటనే సంబంధిత అధికార వర్గాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు బెంగళూరు రైల్వే స్టేషన్ లో భారీ మొత్తంలో మాంసం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ మాంసం నమూనాలను ఫుడ్ లేబొరేటరీకి పంపించారు. ఆ ప్యాకెట్లలో ఉన్నది కుక్క మాంసమా? కాదా? అనేది నిర్ధారించనున్నారు. 

రాజస్థాన్ నుంచి కుక్క మాంసం తీసుకువచ్చి, బెంగళూరులోని కొన్ని హోటళ్లకు సరఫరా చేస్తున్నారని కొన్ని సంఘాలు నిన్న ఆరోపించాయి. దాంతో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏ) అధికారులు, పోలీసులు బెంగళూరు రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు. 

రాజస్థాన్ నుంచి వచ్చిన ఓ రైలు నుంచి 90 అనుమానాస్పద పార్శిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తెరిచి చూడగా, జంతు మాంసం ఉన్నట్టు గుర్తించారు. ఆ మాంసం శాంపిళ్లను ఫుడ్ లేబొరేటరీకి పంపించారు. అది కుక్క మాంసమే అయితే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. 

కాగా, బెంగళూరు హోటళ్లలో మటన్ లో కుక్క మాంసం కలిపి వడ్డిస్తున్నారంటూ హిందుత్వ కార్యకర్త పునీత్ కేరేహళ్లి, ఇతరులు బెంగళూరులోని మెజెస్టిక్ రైల్వే స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసనలు చేపట్టిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను అడ్డుకున్నారంటూ వారిపై అభియోగాలు మోపారు.
Dog Meet
Hotels
Bengaluru
Rajasthan

More Telugu News