Dating Indian Men: భారతీయ పురుషులకు రొమాన్స్ అంటే ఏంటో తెలియదు.. సంచలనంగా మారిన లైఫ్ కోచ్ స్టేట్‌మెంట్!

Life Coach Says She Doesnt Date Indian Men for three reasons
  • భారతీయ పురుషులతో డేటింగ్ చేయడం మానేశానన్న లైఫ్ కోచ్
  • ఇక్కడి వారికి ప్రేమ అంటే ఏంటో తెలియదని, ఇంటి బాధ్యతలు పంచుకోరని కామెంట్
  • మహిళ పోస్టుకు నెట్టింట మిశ్రమ స్పందన 
  • ఇది లింగవివక్షకు సంబంధించిందే కానీ జాతీయతకు చెందిన అంశం కాదని వ్యాఖ్యలు
భారతీయ పురుషులతో డేటింగ్ చేయను.. అంటూ ఓ లైఫ్ కోచ్ అన్న మాటలు ప్రస్తుతం నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విదేశీ మహిళ ఈ మాటంటే మన నెటిజన్లు పట్టించుకోకపోదురు కానీ స్వయంగా ఓ భారతీయ మహిళ ఈ మాట అనడంతో ఈ విషయం సంచలనంగా మారింది. తమ జీవితాలను దారిలో పెట్టుకునేందుకు ఎందరికో సాయపడ్డ లైఫ్ కోచ్ చేతనా చక్రవర్తి కామెంట్స్‌పై పెద్ద దుమారమే రేగుతోంది. అయితే, తన నిర్ణయానికి గల కారణాలనూ ఆమె వివరంగా చెప్పుకొచ్చింది. 

‘‘భారతీయ పురుషులతో డేటింగ్ చేయడం మానేశా. ఇందుకు మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఏ విషయంలోనైనా వారు తమ వాదనను సరిగా వినిపించలేకపోతే మూగనోము పడతారు. మహిళకు పొగరని, మొండిఘటమని ముద్రవేస్తారు. వాళ్లకు రొమాన్స్ అంటే ఏంటో తెలియదు. అవతలి వారి కోసం రోజూ చేసే చిన్న చిన్న పనుల్లోనే రొమాన్స్ దాగుంది. భారీ బహుమతులు, హంగామాతో ఉపయోగాలు ఉండవు. భారతీయ పురుషులకు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం తెలీదు. ఇంటి శుభ్రత భాగస్వామి కోసమే కాదని, అక్కడ తాము కూడా నివసిస్తున్నామన్న స్పృహ ఉండదు’’ అని ఆమె చెప్పుకొచ్చింది. 

సహజంగానే ఈ వీడియోకు నెట్టింట భారీ స్పందన వచ్చింది. ఇప్పటివరకూ 79 వేల వ్యూస్, 12 వేల లైక్స్ రాగా కొందరు మహిళలు ఆమెతో విభేదించారు. తాను భారతీయుడినే పెళ్లాడానని, అతనో అద్భుతమైన వ్యక్తి అని ఓ మహిళ కామెంట్ చేసింది. కొందరితో చెడు అనుభవాలు ఎదురైనంత మాత్రాన భారతీయ పురుషులందరినీ ఒకేగాటన కట్టకూడదని కామెంట్ చేశారు. ఇది భారతీయ పురుషులకే ప్రత్యేకం కాదని, లింగవివక్షకు సంబంధించినదని కొందరు అభిప్రాయపడ్డారు. కొందరు మాత్రం మహిళ అభిప్రాయంతో ఏకీభవించారు.
Dating Indian Men
Relationships
Viral Videos

More Telugu News