Nirmala Sitharaman: ఏపీ రాజధాని అమరావతికి ఇస్తోంది రుణమా, గ్రాంటా?... క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్

Nirmala Sitharama clarifies allocation of Amaravati whether it is loan ot grant
  • నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
  • ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు కేటాయింపు
  • అయితే అది అప్పుగా ఇస్తున్నారా, నిధులా అనే అంశంపై లోపించిన స్పష్టత
  • ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నతో స్పష్టత ఇచ్చిన నిర్మలా సీతారామన్
  • ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చి ఏపీకి ఇస్తామని వెల్లడి
కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు కేటాయించడం తెలిసిందే. అయితే, ఈ రూ.15 వేల కోట్లు అప్పు రూపంలో ఇస్తున్నారా, లేక నిధులా? అనే విషయంలో స్పష్టత లేదు. 

అయితే, ఇవాళ ఢిల్లీలో బడ్జెట్ ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఓ తెలుగు చానల్ ప్రతినిధి అమరావతి, పోలవరం గురించి ఆమెను ప్రశ్నించారు.

అందుకు నిర్మల బదులిస్తూ... ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో అమరావతి అంశం కూడా ఉందని వెల్లడించారు. "ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలని పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. దాని ప్రకారం మేం తప్పనిసరిగా ఏపీకి సాయం అందించాలి. ఇప్పుడు మేం అమరావతికి కేటాయించిన రూ.15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఋణం తీసుకుంటున్నాం. దానికి తదనంతర నిధుల కేటాయింపు కూడా ఉంటుంది. ఇక ఈ ఋణం చెల్లింపులు ఎలా అన్నది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎలా చెల్లించాలన్నది వారితో చర్చించాలి. ఎందుకంటే, ఆ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా, వాళ్ల వాటాను చెల్లించగలరా? లేదా? అన్నది మాట్లాడాలి. అప్పుడు వాళ్ల వాటాను కూడా కేంద్రమే గ్రాంట్ గా ఇవ్వడమన్నది వాళ్లతో మాట్లాడాక నిర్ణయిస్తాం. దీనిపై మేం ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ముందుకు వెళతాం. 

ఇప్పటికే ఏపీకి రాజధాని లేకుండా పదేళ్లు గడచిపోయాయి. భారతదేశంలో ఒక రాష్ట్రం ఉందంటే, దానికి రాజధాని ఉండాలి. కానీ రాజధాని లేకుండా ఉన్న రాష్ట్రం ఆంధ్రా. దీనికి కారకులు ఎవరు? అనే అంశం జోలికి నేను వెళ్లదలచుకోలేదు. రాజధాని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది" అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 

అంతకుముందు, పోలవరం ప్రాజెక్టు అంశంపైనా నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి, ఆ ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. సాధారణంగా జాతీయ ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని, కానీ ఇక్కడ జాతీయ ప్రాజెక్టును రాష్ట్రం నిర్మిస్తోందని, అందువల్ల పోలవరం అంశంలో రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుందని వివరించారు.
Nirmala Sitharaman
Amaravati
Loan
Grant
Union Budget
Andhra Pradesh

More Telugu News