Chevireddy Bhaskar Reddy: చంద్రబాబు నంది అవార్డులు ఇస్తే ఇతడికి కూడా ఒకటివ్వాలి: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

Chevireddy Bhaskar Reddy fires on MLA Pulivarthi Nani

  • పులివర్తి నానిపై చెవిరెడ్డి ఫైర్
  • నాని మంచి యాక్టర్ అంటూ వ్యంగ్యం
  • పబ్లిసిటీ కోసం యాక్టింగ్ చేశాడని ఆరోపణ

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్  రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం అయిందని ఓవైపు వార్తలు వస్తుండగా... మరోవైపు మోహిత్ రెడ్డి తండ్రి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే పులివర్తి నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

దాడి జరిగిందంటూ ఆనాడు పులివర్తి నాని డ్రామా ఆడాడని విమర్శించారు. పులివర్తి నాని ఆ రోజు సాయంత్రం 4.12 గంటలకు ధర్నా చేద్దామని ఎంతో ఉత్సాహంగా షర్ట్ వేసుకుని బయల్దేరాడని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. కానీ, 5.20 గంటలకు పరిస్థితి మారిపోయిందని... పులివర్తి నాని ఒంటిపై షర్ట్ మారిపోయిందని, టీషర్టు  వచ్చిందని, కాలుకు కట్టు కూడా వచ్చిందని, చేతికి బ్యాండేజితో పాటు వీల్ చెయిర్ కూడా వచ్చిందని వివరించారు. 

"ఇతడు నాయకుడు ఎలా అవుతాడు... మంచి యాక్టర్ అవుతాడు గానీ! చంద్రబాబు నంది అవార్డులు ఇస్తే ఈయనకు కూడా ఒకటివ్వాలి. పబ్లిసిటీ కోసం అతను చేసిన యాక్టింగ్ వల్ల ఎస్సైలు సస్పెండ్ అయ్యారు, సీఐలు సస్పెండ్ అయ్యారు, డీఎస్పీలు సస్పెండ్ అయ్యారు, ఎస్పీ కూడా బదిలీ అయ్యాడు... ఏం చేస్తోంది పోలీస్ సంఘం?" అంటూ చెవిరెడ్డి ధ్వజమెత్తారు.

"గతంలో పులివర్తి నాని క్వారీల్లో అధికారులు తనిఖీలకు వస్తే నన్ను సాయం అడగలేదా? నేను ఫోన్లో అధికారులతో మాట్లాడలేదా? రాజకీయం వేరు, వ్యాపారం వేరు. ఒకరి పొట్టకొట్టే పనులు చేయవద్దని ఆ రోజు సదరు అధికారితో నేను మాట్లాడింది నిజం కాదా? నీ క్వారీ వద్దకు ఒక్క అధికారిని కూడా పోనివ్వకుండా ఆపింది నేను కాదా? 

నీకు 12 లారీలు ఉన్నాయి... గత  ప్రభుత్వ హయాంలో ఒక్క లారీ అయినా ఆగిందా? వెంకటేశ్వరస్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను... ఏనాడూ పులివర్తి నానిని శత్రువులా భావించలేదు... ఓ రాజకీయ ప్రత్యర్థిగా మాత్రమే చూశాను... కానీ చంద్రబాబు దగ్గర నన్ను విలన్ గా చూపించి పులివర్తి నాని పదవులు పొందాలని చూస్తున్నారు" అంటూ చెవిరెడ్డి పేర్కొన్నారు. 

Chevireddy Bhaskar Reddy
Pulivarthi Nani
Chevireddy Mohith Reddy
Chandragiri
YSRCP
TDP
  • Loading...

More Telugu News