IL-11 Protein: వృద్ధాప్యాన్ని కలుగజేసే ప్రొటీన్ గుర్తింపు.. జీవితకాలాన్ని 25 శాతం మేర పెంచే ఛాన్స్!

New study finds anti ageing therapy could extend life by 25 percent
  • వృద్ధాప్యంలో కనిపించే శారీరక బలహీనతకు ఐఎల్-11 ప్రొటీన్ కారణమన్న శాస్త్రవేత్తలు
  • ఎలుకలపై ఈ ప్రొటీన్ నిరోధక చికిత్స, అద్భుత ఫలితాలు
  • ఎలుకల్లో ఆయుర్ధాయం పెరుగుదల, శారీరక దృఢత్వం వృద్ధి
  • ఈ చికిత్సతో మనుషుల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయంటున్న శాస్త్రవేత్తలు
వార్ధక్యాన్ని జయించాలనేది తరతరాలుగా మనిషి కంటున్న కల. ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో ఈ దిశగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతుండగా తాజాగా కీలక ముందడుగు పడింది. వార్ధక్యానికి కారణమయ్యే ఓ కీలక ప్రొటీన్‌ను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీన్ని కట్టడి చేసే చికిత్స ద్వారా ఎలుకల జీవితకాలాన్ని ఏకంగా 25 శాతం మేర పెంచగలిగారు. 

వయసు పెరుగుదలకు ఇంటర్ ల్యూకిన్ - 11 అనే ప్రొటీన్ కారణమవుతోందని సింగపూర్‌లోని డ్యూక్ - ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల్లో గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరుపై ఐఎల్-11 కీలక ప్రభావం చూపుతోందని గుర్తించారు. వయసుతో పాటు ఈ ప్రొటీన్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ కాలేయంలో, పొట్టలో కొవ్వు పేరుకుపోతుందని, కండరాలు బలహీనపడుతున్నాయని వెల్లడించారు. ఇవన్నీ శారీరక దృఢత్వాన్ని తగ్గించి, తద్వారా వయసు పెరుగుదల ప్రక్రియను కొనసాగిస్తున్నాయని తెలిపారు. 

ఎలుకల్లో ఆయుర్దాయం వృద్ధి
ఐఎల్-11 ప్రొటీన్‌ను నిరోధించిన శాస్త్రవేత్తలు ఎలుకల జీవిత కాలాన్ని 25 శాతం మేర పెంచగలిగారు. ఆడ ఎలుకల్లో ఐఎల్-11 నిరోధక చికిత్స ద్వారా శారీరక క్షీణత, వ్యాధులు, బలహీనత, మొదలైన వాటి నుంచి రక్షణ లభించింది. ఇదే చికిత్సతో మగ ఎలుకల జీవితకాలం 22.5 శాతం మేర పెరిగింది. అంతేకాకుండా, ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే తెల్ల కొవ్వు బదులు, క్యాలరీలను ఖర్చు చేసే బ్రౌన్ ఫ్యాట్ ఉత్పత్తి ఎలుకల్లో మొదలైంది. ఈ ఫలితాలపై డ్యూక్ - ఎన్‌యూఎస్ డీన్ ప్రొఫెసర్ సథామస్ కాఫ్‌మన్ మాట్లాడుతూ.. ఐఎల్-11 చికిత్సతో వృద్ధులు మరింత ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడతాయని చెప్పారు. శారీరక దృఢత్వం పెరిగి వృద్ధులు జారి పడే అవకాశాలు తగ్గుతాయని అన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యవంతమైన దీర్ఘకాలిక జీవితాలు గడిపేలా ఐఎల్-11 చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా లక్ష్యం’ అని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త స్టార్ట్‌కుక్ పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు తాజాగా సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
IL-11 Protein
Anti Ageing Treatment

More Telugu News